logo

ముంపు ముప్పు.. తప్పదు ముందస్తు మేల్కొలుపు

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. తేలికపాటి వర్షాలు కురిసినా ఏటా నగరం నీట మునుగుతోంది. ఈ ఏడాదీ ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు అంతంత మాత్రంగా ఉన్నందున మంపు ముప్పు పొంచి ఉంది.

Published : 10 Jun 2023 02:49 IST

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. తేలికపాటి వర్షాలు కురిసినా ఏటా నగరం నీట మునుగుతోంది. ఈ ఏడాదీ ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు అంతంత మాత్రంగా ఉన్నందున మంపు ముప్పు పొంచి ఉంది. ప్రధానమైన నాలాల పూడికతీత పనులతోనే సరిపెట్టారు. డివిజన్లలోని అంతర్గత డ్రైనేజీల్లో వ్యర్థాలు తొలగించలేదు. చెరువుల మత్తడి నాలాలు విస్మరించారు. వరద నీటి కాల్వల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌తోపాటు విలీన గ్రామాల్లో ముందస్తు పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. ముంపు కాలనీలు, నాలాలు, అంతర్గత డ్రైనేజీలు, ముందస్తు పనులపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

నాలాల పూడికతీత అంతంత మాత్రమే!

కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల్లో 33 ప్రధాన నాలాల్లో పూడికతీత పనులు చేపట్టారు. 70-80 శాతం పనులు పూర్తయ్యాయని బల్దియా ఇంజినీర్లు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇందుకు విరుద్ధంగా ఉంది.

కాజీపేట రామకృష్ణ కాలనీ, దర్గారోడ్‌, డీజిల్‌ కాలనీల నాలాల్లో పూడికతీత పనులు చేయాల్సి ఉంది.

హనుమకొండ నయీంనగర్‌ నాలా పూడికతీత పనులు సరిగ్గా జరగలేదు. నాలుగు వెంట్సు ఉండగా కేవలం ఒకే వెంటు వద్ద పూడికతీత పనులు చేపట్టారు. పోచమ్మకుంట, భగత్‌సింగ్‌నగర్‌, 100 అడుగులు రోడ్డులో చేయాలి.

వరంగల్‌ దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు, కొత్తవాడ 80 అడుగుల నాలా, ఎల్బీనగర్‌, అబ్బనికుంట, చింతల్‌, శివనగర్‌, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, డీకేనగర్‌ నాలాల్లో వ్యర్థాలు తీయాలి.


వ్యర్థాలతో అంతర్గత డ్రైనేజీలు

డివిజన్లలో అంతర్గత డ్రైనేజీల్లో ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు పేరుకుపోయాయి. పారిశుద్ధ్య కార్మికులతో గ్యాంగ్‌ వర్క్‌ చేయించాలని మేయర్‌, కమిషనర్‌ ఆదేశించినప్పటికీ కొన్ని డివిజన్లలో కదలిక లేదు.

ఉర్సు, కరీమాబాద్‌, విద్యానగర్‌, శివనగర్‌, రంగశాయిపేట, చింతల్‌, అబ్బనికుంట, కాశీబుగ్గ, ఎల్బీనగర్‌, కొత్తవాడ, మట్టెవాడ, గిర్మాజిపేట, రామన్నపేట, రంగంపేట, హనుమకొండ మచిలీబజారు, కాకతీయ కాలనీ, రాయపురా, రెడ్డికాలనీ, బాలసముద్రం, కాకాజీ కాలనీ, ఎన్జీవోస్‌ కాలనీ, కనకదుర్గ కాలనీ, ఇందిరానగర్‌, జులైవాడ, కాజీపేటలో రామకృష్ణ కాలనీ, ప్రశాంత్‌నగర్‌, దర్గా రోడ్డు, సోమిడి, బాపూజీనగర్‌ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయాలి.


ఇలా సన్నద్ధమైతే మేలు..

నగర శివారు నుంచి వచ్చే వరదనీరు సాఫీగా వెళ్లేలా నాలాలు క్లియర్‌గా ఉంచాలి.

నాలాలు, అంతర్గత డ్రైనేజీల్లో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలి

కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ ప్రధాన రహదారుల్లో వరదనీరు నిల్వకుండా కచ్చా కాల్వలు తీయాలి.

ముంపు ప్రాంతాల్లో ముందస్తుగా కచ్చా కాల్వలు తీయాలి. నీరు నిలిచే దగ్గర మట్టితో నింపాలి.

హంటర్‌రోడ్‌ బొందివాగు నాలా పరిసరా కాలనీల్లో కచ్చా కాల్వలు తీయాలి.

హంటర్‌రోడ్‌ 12 మోరీలు, పోతనరోడ్‌, భద్రకాళి, అలంకార్‌ నాలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ముందస్తుగా సహాయ పునరావాస కేంద్రాలు ఎంపిక చేయాలి.

బల్దియాలో కంట్రోల్‌ రూం, ముంపు కాలనీలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి.

డీఆర్‌ఎఫ్‌, టౌన్‌ప్లానింగ్‌, ప్రజారోగ్య విభాగాలతో బృందాలు ఏర్పాటు చేయాలి.


ముంపు కాలనీలు ఎన్నో..

కాజీపేట: ప్రశాంత్‌నగర్‌, రామకృష్ణ కాలనీ, డీజిల్‌ కాలనీ

హనుమకొండ: అలంకార్‌, కాకతీయ కాలనీ, పద్మాక్షికాలనీ, విద్యానగర్‌, సమ్మయ్యనగర్‌, టీవీ టవర్‌ కాలనీ, అంబేడ్కర్‌ భవన్‌, ఎన్జీవోస్‌ కాలనీ, వికాస్‌నగర్‌  

వరంగల్‌: రంగంపేట, సరస్వతి కాలనీ, భద్రకాళి రోడ్‌, కొత్తవాడ, బ్యాంకు కాలనీ, మర్రి వెంకటయ్య కాలనీ, ఎల్బీనగర్‌, కాశీబుగ్గ సొసైటీ కాలనీ, ఎనుమాముల మధురానగర్‌, సాయి కాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, అబ్బనికుంట, చింతల్‌, శివనగర్‌, కాశీకుంట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, ఎన్టీఆర్‌నగర్‌, సాయినగర్‌, సంతోషిమాత కాలనీ, రామన్నపేట బీసీˆ కాలనీ, గాయత్రినగర్‌, పోతననగర్‌ కాలనీలు నీట మునుగుతున్నాయి.


వరదనీటి కాల్వ పనులు ఆలస్యం

వరదనీటి కాల్వల నిర్మాణ పనులు నెలలు గడుస్తున్నా పూర్తవ్వడం లేదు.

జవహర్‌నగర్‌ నుంచి ప్రెసిడెన్సీ స్కూల్‌ వరకు వరద నీటి కాల్వ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

వరంగల్‌ పోతనరోడ్డు, సంతోషిమాత కాలనీ, శివనగర్‌ ప్రాంతాల్లో పనులు మధ్యలోనే ఉన్నాయి.

ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేసిన వరద నీటి కాల్వల పనులు మొదలు కాలేదు.


వర్ధన్నపేటలో..

వర్ధన్నపేట, న్యూస్‌టుడే: సమస్య నెలకొన్న వార్డులు: వర్ధన్నపేట మున్సిపాలిటీలో మురుగు నీరు, వర్షం నీరు వెళ్లే వ్యవస్థ సక్రమంగా లేదు. ఏడో వార్డులోని ఫిరంగిగడ్డ నుంచి కోనాపురం వెళ్లే దారిలో నీరు నిలుస్తుండడంతో.. సమీపంలోని నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. 2వ వార్డులో రోడ్డు విస్తరణ, మురుగు కాల్వల నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉండడంతో వర్షం నీరు జాతీయ రహదారిపై నిలిచే అవకాశం ఉంది. 3, 5, 10, 11 వార్డుల్లో వర్షం నీరు, మురుగు కాల్వల ద్వారా వెళ్లలేక రోడ్లపై నిలుస్తోంది.

పరిష్కారం:  పట్టణ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేస్తే భవిష్యత్తులో పట్టణంలో వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని