జాతీయ రహదారుల రక్త దాహం!
ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులు నిత్యం ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్నాయి.
అతివేగంతో ప్రాణాలు కోల్పోతున్న యువత
న్యూస్‌టుడే, ధర్మసాగర్, మరిపెడ, వర్ధన్నపేట
ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులు నిత్యం ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్నాయి. శుక్రవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల సమీపంలో 163వ జాతీయ రహదారిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల గ్రామ శివారులో 365 జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో యువకుడి అతివేగం ఆయనతో పాటు మరొకరి ప్రాణం బలిగొంది. భూపాలపల్లి జిల్లా కాటారం-మేడారం ప్రధాన రహదారిపై మహాముత్తారం మండలంలో ఈ ఘటన జరిగింది. ట్రాలీ ఆటోను ద్విచక్రవాహనం ఢీకొనడంతో దీనిపై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటనల నేపథ్యంలో జాతీయ రహదారులపై వరుస ప్రమాదాలకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం..
రోడ్డు చాలా బాగుందని.. ద్విచక్రవాహనాలపై వేగంగా దూసుకెళ్తున్న యువత తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీంతో పాటు ప్రయాణ జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిద్రలేకుండా వాహనాలను నడపడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి..
ఇదీ పరిస్థితి..
ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 163పై కరుణాపురం, వరంగల్ కార్పొరేషన్ ఉనికిచర్ల శివారు వరకు ఈ ఆరు నెలల్లోనే 18 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మృతి చెందగా, 19 మంది గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిలో ఒక్కరు తప్ప అందరూ యువకులే.
ఇటీవల జరిగిన ఘటనలు..
* ఏప్రిల్ 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో కరుణాపురానికి చెందిన పసునూరి పూర్ణచందర్(34) అక్కడికక్కడే మృతి చెందారు.
* మార్చి 20న రాంపూర్ జాతీయ రహదారి (అవుటర్ రింగ్‌రోడ్డు) పక్కన ఆగి ఉన్న వ్యాన్‌ను వెనుక నుంచి ద్విచక్రవాహనదారుడు ఢీకొనడంతో చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలకు చెందిన రామగుండం ఉదయ్‌కిరణ్(18), ఇదే గ్రామానికి చెందిన తంగళ్లపల్లి అఖిల్(21) దుర్మరణం చెందారు.
* హసన్‌పర్తి మండలం అనంతసాగర్ రహదారిపై మే 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ద్విచక్రవాహనం నడిపేవారు కచ్చితంగా శిరస్త్రాణం ధరించాలి.
* వేగాన్ని నియంత్రించుకోవాలి. ఏ ప్రాంతంలో ఎంత వేగంతో వెళ్లాలో గుర్తుంచుకుని కచ్చితంగా పాటించాలి.
* నిద్రలేకుండా వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దు.
* మూల మలుపుల వద్ద నెమ్మదిగా వెళ్లాలి.
* దూర ప్రయాణం చేసేవారు మధ్యలో ఆగి కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. లగేజీతో వాహనాలు నడపొద్దు.
* ఎక్కడ పడితే అక్కడ ఓవర్‌టేక్ చేయొద్దు.
* వాహనాలు సరైన కండీషన్లలో ఉన్నాయా లేవా చూసుకోవాలి.
వేగానికి వేద్దాం అడ్డుకట్ట
జాతీయ రహదారిపై ఏ ప్రాంతంలో ఎంత వేగంతో వెళ్లాలో అధికారులు హెచ్చరిక బోర్డులను పెట్టారు. వాహనదారులు వీటిని పట్టించుకోవడం లేదు. సాధారణంగా గంటకు కారు 80, లారీ 60, ద్విచక్రవాహనం 40 కి.మీ. వేగంతో వెళ్లాలి. ప్రతిచోట 80 నుంచి 120 కి.మీ.. అంతకు మించి వేగంతోనే వెళుతున్నాయి.
ఇటు చూసి నడపండి..!
న్యూస్‌టుడే, నర్సింహులపేట (డోర్నకల్): వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి 365పై ఏర్పడిన గుంత ఇది. నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజీ సమీపంలో కొన్నేళ్ల కిందట తాగునీటి కోసం పైపులైను నిర్మించారు. ఇటీవల పగిలిపోయి నీరు లీకేజీ అయింది. ఈ క్రమంలో ఏర్పడిన గుంత ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి మరమ్మతు చేయించాలి.
నిబంధనలు పాటించకపోవడం వల్లే..
- తండా వంశీ, హైవే పెట్రోలింగ్ సూపర్‌వైజర్
జాతీయ రహదారిపై ప్రయాణించేవారిలో చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. ఎక్కడ ఎలా వెళ్లాలో తెలియకుండా, హైవే రోడ్డు కదా అని ఇష్టారీతిలో వెళుతున్నారు. దాని వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య