logo

ఖర్చుల కాలం.. పొదుపే మంత్రం!

జూన్‌.. పేద, మధ్య తరగతి కుటుంబాలతో అధికంగా ఖర్చు పెట్టిస్తోంది. ఓవైపు సాగు పనులు.. మరో వైపు బడులు ప్రారంభం.

Published : 10 Jun 2023 02:49 IST

ఇటు ఏరువాక.. అటు బడిబాట
జూన్‌..

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, వరంగల్‌ విద్యావిభాగం: జూన్‌.. పేద, మధ్య తరగతి కుటుంబాలతో అధికంగా ఖర్చు పెట్టిస్తోంది. ఓవైపు సాగు పనులు.. మరో వైపు బడులు ప్రారంభం. ఇవి డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఈసారి పంటసాగు ఖర్చులు, బడి ఫీజులు మరింత పెరిగాయి. ఖర్చులతో ముడిపడిన ఈ నెలను నెట్టుకువచ్చేందుకు దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఆర్థిక ప్రణాళిక, ముందస్తు ఏర్పాట్లు, పొదుపు చర్యలతో ఈ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రైతులపై అదనపు భారం

జూన్‌ నెలలో రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రారంభమైంది. అన్నదాతలు పత్తి, మిరప, మొక్కజొన్న విత్తనాలతో పాటు వడ్లు కొనుగోలు చేస్తున్నారు. వరి నారుమడులు సిద్ధమవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే పెరిగిన విత్తనాల ధరలతో అన్నదాతలపై అదనపు భారం పడుతోంది.

గతేడాది 450 గ్రాముల పత్తి విత్తనాల సంచి రూ.810 ఉండగా ఈసారి రూ. 43 పెరిగి రూ.853కు చేరింది. అధిక డిమాండ్‌ ఉన్న 10 గ్రాముల మిరప గింజల ప్యాకెట్‌ గతేడాది రూ.710 ఉండగా ఈసారి రూ.60 పెరిగి రూ.770 అయింది.

ఉమ్మడి జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు రూ.11 లక్షల వరకు విత్తన సంచులు అవసరం. సుమారు 1.45 లక్షల ఎకరాల్లో సాగుకానున్న మిర్చికి 145 క్వింటాళ్ల విత్తనం అవసరం. ఈ లెక్కన పెరిగిన విత్తన ధరలతో అన్నదాతలపై రూ.లక్షల్లో భారం పడనుంది.  

శాస్త్రవేత్తల సూచనలతో తగ్గించుకోవచ్చు..

వరి పండించే రైతులు ఫౌండేషన్‌ సీడ్‌ సాగు చేస్తే ఆ పంటలోంచే విత్తనోత్పత్తి చేసుకోవాలి. అలా మూడు సీజన్లకు విత్తనోత్పత్తి చేసుకొని సాగు చేసుకుంటే విత్తనాల కొనుగోలు భారం తగ్గుతుందని మల్యాల కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మాలతి సూచించారు. మినుములు, పెసర, కంది, నువ్వులు కూడా విత్తనోత్పత్తి చేసుకుంటే పెట్టుబడి తగ్గుతుంది. పత్తి, మిరప, మొక్కజొన్నలో హైబ్రిడ్‌ రకాలు ఉన్నందున వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన దుకాణాల్లోనే వాటిని కొనుగోలు చేయాలి.


పాఠశాలలు ప్రారంభంతోనే..

వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12 నుంచి బడులు పునఃప్రారంభమవుతున్నాయి. పిల్లలకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, షూస్‌, టై, స్టేషనరీ, యూనిఫాం కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. వాటికయ్యే వ్యయాన్ని ఒక్కొక్కటిగా లెక్కిస్తూ అవాక్కవుతున్నారు. అందుకు అవసరమైన సొమ్మును పోగు చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు.


ప్రభుత్వ తోడ్పాటు ఉండాలి..

విద్యాసంవత్సరం, సాగు సీజన్‌ ఒకేసారి ప్రారంభమవుతున్నందున ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని  కేయూ అర్థశాస్త్రం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తిరుణహరి శేషు అన్నారు. సూచనలు ఆయన మాటల్లోనే..

గతంతో పోలిస్తే రాత, పాఠ్య పుస్తకాల ధరలు పెరగడంతో పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భారం కానుంది. ఇందుకు ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో విక్రయిస్తున్న పాఠ్య, రాత పుస్తకాల ధరలు నిర్ణయించి ఆ నిబంధనల ప్రకారం అమ్మకాలయ్యేలా చూడాలి.

రైతులు సాగుకు సంబంధించిన పరికరాలు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. అలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం సీజన్‌ ఆరంభంలోనే బ్యాంకుల ద్వారా పంట రుణ సాయాన్ని అందించేలా చూడాలి.



పెరిగిన ధరలే కారణం..

- బోడ విష్ణు, బూరకుంట తండా

గతేడాది రెండెకరాల్లో పత్తి, మూడున్నర ఎకరాల్లో మిర్చి పంట వేశాను. విత్తనాల కోసం రూ.75 వేలు ఖర్చు చేశాను. ఈసారి అవే పంటలను సాగు చేయడానికి విత్తనాల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అదనంగా రూ.10 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం రాయితీ ద్వారా అందిస్తే బాగుంటుంది.


పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు

-  డి.సంతోష్‌కుమార్‌, పోచమ్మకుంట, హనుమకొండ

ఈసారి పాఠ్య, రాత పుస్తకాల ధరలు 40 శాతం పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పిల్లలు చదువుకునే పుస్తకాలపై ధరలను పెంచడం సరికాదు. అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు