ప్రత్యామ్నాయ సాగుపై ప్రణాళికలు రూపొందించాలి
పంటల సాగు సరళి మార్పుతోనే వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డా.రావుల ఉమారెడ్డి అన్నారు.
వరంగల్ వ్యవసాయం, న్యూస్‌టుడే: పంటల సాగు సరళి మార్పుతోనే వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డా.రావుల ఉమారెడ్డి అన్నారు. ఇందుకు రైతులంతా సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. శుక్రవారం తెలంగాణ అగ్రిటెక్, అసోచామ్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఆధునిక వ్యవసాయం, సాంకేతిక సాగు విధానాలపై ప్రదర్శన, సదస్సు జరిగింది. ప్రదర్శన కేంద్రాన్ని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో కలిసి అసోచామ్ కో కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్రారంభించారు. సదస్సులో డా.ఉమారెడ్డి ప్రసంగించారు.
వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి వ్యవసాయ సీజన్లను మార్చి 30లోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. పత్తి విభాగ సీనియర్ శాస్త్రవేత్త డా.రాంప్రసాద్ మాట్లాడుతూ.. పత్తి పంటకు గులాబీ పురుగు బెడద ఇప్పటికీ ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక సాంద్రత విధానంలో సాగు చేయడం మేలని సూచించారు. సదస్సు అనంతరం రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, అధికారులు సమాధానాలిచ్చారు. ఈ సదస్సులో ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర్‌రాజు, సీనియర్ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు రవీందర్‌సింగ్, ఉషాదయాళ్ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డా.దిలీప్‌కుమార్, శాస్త్రవేత్తలు డా.మధు, డా.బలరాం ఉమ్మడి వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల రైతులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శన : ప్రదర్శనలో సుమారు 80 వరకు స్టాళ్లు ఏర్పాటు చేశారు. అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల పంటల విత్తనాలు, ఆధునిక పనిముట్లు, యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, సేంద్రియ వ్యవసాయం, సస్యరక్షణ మందుల వినియోగం, ఉద్యాన, పట్టు, వ్యవసాయ రంగంలో వినియోగించే పరికరాలు, కొత్తసాగు విధానంలో ఉపయోగించే ట్రాక్టర్లు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వంగడాలు తదితరాలను ప్రదర్శించారు. ఇత్తడి, వెండి, తదితర లోహాలతో చేసిన దేవతల ప్రతిమలు, జిమ్ పరికరాలు, సోఫా సెట్లు కూడా ప్రదర్శనలో అమ్మకానికి పెట్టడం విశేషం. ఆదివారం వరకు ప్రదర్శన కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.