గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు.
భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. భూపాలపల్లి పురపాలక సంఘం సమావేశ మందిరంలో శుక్రవారం సంబంధిత అధికారులతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎటువంటి పొరపాట్లు రాకుండా అధికారులు సమర్థంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగించాలని పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు మానిటరింగ్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో 2,369 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు రాకుండా, ప్రతి గదిలో ఫ్యాన్లు తిరిగేలా, లైటింగ్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో వికలాంగుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఉదయం 8.30 గంటల నుంచే అభ్యర్థులను పంపించాలి. పోలీసు బందోబస్తుతో పరీక్షకు సంబంధించిన మెటీరియల్‌ను లైజనింగ్ అధికారులకు అందజేయాలని ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయాలి: జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు మంచి పేరు తీసుకొస్తూ.. అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన అటవీ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో వసతులు చాలా తక్కువగా ఉన్నాయని, సింగరేణి యాజమాన్యం కొత్తగా నిర్మిస్తున్న క్వార్టర్లలో వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. నూతన విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించాలని, ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజు, ప్రొఫెసర్లు నాగార్జున్‌రెడ్డి, డాక్టర్ తిరుపతి, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.