logo

పశువుల సంచారం.. ప్రాణ సంకటం

భూపాలపల్లిలో జాతీయ రహదారితోపాటు ఇతర ప్రధాన రోడ్లపై పశువులు యథేచ్ఛగా తిరగడమే కాకుండా, వాటిపైనే సేద తీరడంతో వాహన ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి.

Published : 21 Sep 2023 03:00 IST

జవహర్‌ నగర్‌ కాలనీ సమీపంలో జాతీయ రహదారిšపై..

భూపాలపల్లి, న్యూస్‌టుడే: భూపాలపల్లిలో జాతీయ రహదారితోపాటు ఇతర ప్రధాన రోడ్లపై పశువులు యథేచ్ఛగా తిరగడమే కాకుండా, వాటిపైనే సేద తీరడంతో వాహన ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. వేగంగా వచ్చే పెద్ద పెద్ద వాహనాలు తగిలి మూగ జీవాలు  మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. భూపాలపల్లి నుంచి గణపురం మండలం చెల్పూరు వరకు సెంట్రల్‌ లైటింగ్‌, మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో కూడా మొక్కలు పెంచడంతో వాటి నీడకు పశువులు చేరి సేద తీరుతున్నాయి. భూపాలపల్లి పట్టణంలో గణేష్‌ చౌక్‌ నుంచి జంగేడు, కాశీంపల్లి రహదారి, అంబేడ్కర్‌ కూడలి నుంచి సుభాష్‌కాలనీ, కృష్ణాకాలనీ వరకు గల రహదారులపై పశువుల సంచారం ఉంటోంది. గుంపులు గుంపులుగా రోడ్డుపై తిరుగుతున్నాయి.  కేటికే 1, 5, 6, 8వ ఇంక్లైయిన్‌లోని రోడ్ల పైన కూడా పశువులు తిష్టవేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

మచ్చుకు కొన్ని..

  • పట్టణంలోని గణేష్‌ చౌక్‌ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం పశువులు గుంపు జాతీయ రహదారిపై తిరుగుతున్న క్రమంలో అందులోని రెండు పశువులు ఒకదానిని మరొకటి పొడుచుకుంటూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న ఇద్దరు యువకులు గాయపడ్డారు.
  • పట్టణంలోని సుభాష్‌కాలనీ ప్రాంతంలోని రామాలయం సమీపంలో రహదారిపై పశువులు సేద తీరడంతో రెండేళ్ల క్రితం ఉదయం పూట ద్విచక్ర వాహనంపై అంబేడ్కర్‌ కూడలి వైపు వస్తున్న సుభాష్‌కాలనీకి చెందిన యువకుడు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి, పశువులను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు.
  • పట్టణంలోని సీఆర్‌నగర్‌ కాలనీ ప్రాంతంలోని కేటికే 6వ గని రహదారి ప్రాంతంలో ఆరు నెలల క్రితం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చిన స్థానిక కాకతీయ కాలనీకి చెందిన ఓ యువకుడు పశువులను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం తగిలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షానికి తడిసిన రోడ్లపై నిర్ణీత వేగంతో మాత్రమే ప్రయాణించాలి. అకస్మాత్తుగా బ్రేకులు వేయొద్దు. ఇలా చేస్తే చక్రాలు జారి వాహనం అదుపుతప్పే ప్రమాదం ఉంది. డూమ్‌ లైట్‌ సరిగా ఉండేలా చూసుకోవాలి. పశువులు ఉన్నట్లు గుర్తిస్తే 50 మీటర్ల ముందే వేగం తగ్గించి బ్రేకులు వేసుకోవాలి. కార్లు, ఇతర వాహనాలను డివైడర్ల పక్క నుంచే కాకుండా రహదారి మార్జిన్‌ సరిచూసుకుంటూ నడపాలి. వైపర్లు సరిగా పనిచేసేలా చూసుకోవాలి. వాహన బ్రేకులు కండిషన్‌లో ఉంచుకోవాలి. ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించాలి. పశువుల పక్కన నుంచి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా నడపాలి. లేదంటే అవి బెదిరి మీదపడే ప్రమాదం ఉంటుంది.

అధికారులు దృష్టి పెట్టాలి..

రహదారులపై పశువుల సంచారాన్ని నిలువరించేందుకు పురపాలక అధికారులు చేసిన ప్రకటనలు ఆచరణలోకి రావడం లేదు. సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. వర్షాలు కురిసిన సమయంలో పశువులు రోడ్లపైన సంచరిస్తుండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉన్నందున రోడ్లపై పశువుల సంచారాన్ని నియంత్రించేందుకు అధికారులు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పశువులను స్థానిక బందెల దొడ్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలి. పశువుల పెంపకందారులను గుర్తించి, వారికి నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత వారు వినిపించుకోకుంటే పశువులను దూరప్రాంతాల్లోని గోశాలకు తరలించారు.

పట్టణంలోని గణేష్‌ చౌక్‌ ప్రాంతంలో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని