logo

మామూళ్ల కోసం ప్రైవేటు భవనాల్లో ఫాగింగ్‌

హనుమకొండ ప్రాంతం వడ్డేపల్లి 80 అడుగుల రోడ్డులోని ఓ అపార్టుమెంటులో దోమల నివారణ కోసం ఫాగింగ్‌ చేస్తూ అర్బన్‌ మలేరియా తాత్కాలిక కార్మికుడ ఎర్ర రాజు ఊపిరడాక ఇటీవల మృతి చెందారు.

Updated : 21 Sep 2023 05:14 IST

వడ్డేపల్లి ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో ఫాగింగ్‌ చేస్తున్న కార్మికుడు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: హనుమకొండ ప్రాంతం వడ్డేపల్లి 80 అడుగుల రోడ్డులోని ఓ అపార్టుమెంటులో దోమల నివారణ కోసం ఫాగింగ్‌ చేస్తూ అర్బన్‌ మలేరియా తాత్కాలిక కార్మికుడ ఎర్ర రాజు ఊపిరడాక ఇటీవల మృతి చెందారు. నిబంధనల ప్రకారం ప్రైవేటు భవనాల్లో ఫాగింగ్‌ చేయకూడదు. హనుమకొండకు చెందిన ఓ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ హుకుం జారీ చేయడంతో కార్మికుడు ఫాగింగ్‌కు వెళ్లినట్లు తెలిసింది. దీనిపై గ్రేటర్‌ వరంగల్‌ ఒప్పంద ఉద్యోగ, కార్మిక సంఘాల ఐకాస ప్రతినిధులు మేయర్‌, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి విచారణ లేదు.

  • నగరంలో బల్దియా అర్బన్‌ మలేరియా విభాగం ప్రజాసేవ మరచి ప్రైవేటు వ్యక్తుల సేవలో నిమగ్నమయింది. నిబంధనలకు విరుద్ధంగా మామూళ్ల కోసం అపార్టుమెంట్లు, స్టార్‌ హోటళ్లు, లాడ్జ్‌లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫాగింగ్‌ చేస్తున్నట్లుగా తెలిసింది. వారానికి రెండు, మూడుసార్లు ఫాగింగ్‌ చేస్తే రూ.1000-1500 వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మలేరియా విభాగానికి చెందిన హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు ఇష్జారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది.

షెడ్యూల్‌ బేఖాతరు..

నగరంలో దోమల నివారణ ఫాగింగ్‌ చేసేందుకు నాలుగు పెద్ద ఆటోలు, 35 హ్యాండ్‌ మిషన్లు ఉన్నాయి. రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో ఫాగింగ్‌ చేయడం కోసం 66 డివిజన్ల వారీగా షెడ్యూల్‌ రూపొందిస్తారు. పెద్ద ఆటోలు వరంగల్‌లో 2, హనుమకొండలో 2 నడుస్తాయి. హ్యాండ్‌ మిషన్లు రెండు డివిజన్లకొకటి వెళ్తాయి. ఫాగింగ్‌ కోసం రోజుకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్రోలు, డీజిల్‌ కోసం గ్రేటర్‌ ఖర్చు చేస్తోంది. హెల్త్‌ ఇన్‌స్పెక్టర్ల, హెల్త్‌ అసిస్టెంటు ఉద్యోగుల పర్యవేక్షణలో పనిచేయాల్సిన సిబ్బంది షెడ్యూల్‌ను పక్కన పెట్టేసి ప్రైవేటు భవనాల్లో ఫాగింగ్‌ చేస్తున్నారు.

  • ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల ఒత్తిళ్లతో ప్రైవేటు సేవకెళ్తున్నట్లుగా తెలిసింది. హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఫాగింగ్‌ షెడ్యూల్‌ పూర్తిగా దారి తప్పింది. కొందరు ఉద్యోగులు ఫాగింగ్‌ చేయకుండానే చేసినట్లుగా దొంగ సంతకాలు సమర్పిస్తున్నారు. నెలరోజుల క్రితం హనుమకొండలో ఉదాహరణ బయట పడింది. ఫాగింగ్‌ యంత్రాలకు వినియోగించాల్సిన డీజిల్‌, పెట్రోల్‌ దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కమిషనర్‌ ఆగ్రహం: హనుమకొండ వడ్డేపల్లిలోని అపార్టుమెంటులో ఫాగింగ్‌ చేసేందుకు వెళ్లిన తాత్కాలిక కార్మికుడు మృతి చెందిన ఘటనపై కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా ఆరా తీశారు. హనుమకొండకు చెందిన హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, హెల్త్‌ అసిస్టెంట్ల పనితీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాలనీలను వదిలేసి, ప్రైవేటు భవనాల్లో ఫాగింగ్‌ చేయడాన్ని తప్పు పట్టారు. దీనిపై విచారణ చేపట్టాలని అదనపు కమిషనర్‌ను ఆదేశించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని