logo

ర్యాగింగ్‌ రోగానికి చికిత్స చేద్దాం

కాకతీయ వైద్య కళాశాలలోని వైద్యులు అనేక రోగాలకు మందులిచ్చి వ్యాధులు నయం చేస్తున్నారు. క్యాంపస్‌లో బుసలు కొడుతున్న ర్యాగింగ్‌ రోగానికి మాత్రం మందు కనుగొనడం లేదు.

Updated : 21 Sep 2023 05:12 IST

ఏటా కేఎంసీలో బుసలు కొడుతోంది..

ఈనాడు, వరంగల్‌, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: కాకతీయ వైద్య కళాశాలలోని వైద్యులు అనేక రోగాలకు మందులిచ్చి వ్యాధులు నయం చేస్తున్నారు. క్యాంపస్‌లో బుసలు కొడుతున్న ర్యాగింగ్‌ రోగానికి మాత్రం మందు కనుగొనడం లేదు. ఈ వ్యాధితో తమ భవిష్యత్తు దెబ్బతింటుందని తెలిసి కూడా కొందరు విద్యార్థులు దీన్ని మామూలుగా తీసుకుంటున్నారు. పైగా ఈ జబ్బు ఒకరి నుంచి మరొకరికి సోకుతుండడంతో ఏటా తరగతులు ప్రారంభం కాగానే సీజనల్‌ వ్యాధిలా వ్యాపిస్తోంది. చికిత్స కన్నా నివారణే మేలు అని చెప్పే వైద్యులు ర్యాగింగ్‌ నివారణపై మాత్రం దృష్టి సారించడం లేదు.  

కొత్తగా కళాశాలల్లో ప్రవేశాలు పొందిన జూనియర్‌ విద్యార్థులను సీనియర్లు మానసిక వేధింపులు, భౌతిక దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో బాధిత జూనియర్‌ విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తుండగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడటం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్దిమంది విద్యార్థులు మాత్రమే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం వల్ల విషయాలు బయటకు వస్తున్నాయి.

అసలేం జరిగిందంటే..

ఈ నెల 14న అర్ధరాత్రి కేఎంసీలో ప్రథమ సంవత్సరం విద్యార్థి రీడింగ్‌ రూం నుంచి వసతిగృహంలోని తన గదికి వెళ్తుండగా సీనియర్‌ (ద్వితీయ సంవత్సరం) విద్యార్థి అతన్ని తాగునీటి కోసం నిలువరించారు. జూనియర్‌ వినకుండా వెళ్లిపోవడంతో ఈ సీనియర్‌ జీర్ణించుకోలేకపోయారు. గదిలో నుంచి బయటకు పిలిచి భౌతికంగా దాడిచేసి గాయపర్చారు. తనపై దాడిచేసిన సీనియర్లపై జూనియర్‌ విద్యార్థి ఫిర్యాదుతో ఇటు పోలీసులు, అటు కళాశాల అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవడంతోపాటు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ర్యాగింగ్‌కు సహకరించిన ఆరుగురు విద్యార్థులు కళాళాల నుంచి బహిష్కరణకు గురయ్యారు. క్షణికావేశంలో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.  

తీసుకోవాల్సిన చర్యలు

  • విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడేవారిపై చట్టపరంగా తీసుకునే చర్యలను వివరిస్తూ సూచికలను ఏర్పాటు చేయాలి.
  • తమ కళాశాలలో చేరబోయే విద్యార్థులకు అందజేసే ప్రాస్పెక్టస్‌లో ర్యాగింగ్‌ పూర్తిగా నిషేధించామని.. ఇందుకు పాల్పడితే విద్యార్థులను కళాశాల నుంచి వేటు వేస్తామని, జరిమానా, బహిరంగ క్షమాపణ చెప్పటం వంటి కఠిన శిక్షలు విధిస్తామని పేర్కొనాలి.
  • శిక్షలో భాగంగా విద్యార్థి ఉపకార వేతనాలు, ఇతర సంక్షేమ సౌకర్యాలు నిలిపివేత,  పరీక్షా ఫలితాల నిలుపుదల, వసతి గృహ బహిష్కరణ వంటి చర్యలు తీసుకోవాలి.
  • విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకుడి నుంచి తాము ర్యాగింగ్‌ నేరానికి పాల్పడబోమని హామీ పత్రం తీసుకోవాలి.
  • ర్యాగింగ్‌కు గురైతే ఎవరిని సంప్రదించాలో చరవాణి నెంబరు, ఈమెయిల్‌ వివరాలు కళాశాలలో రాసి పెట్టాలి. 
  • ప్రతి కళాశాల, వసతి గృహాల్లో విద్యార్థులతో ర్యాగింగ్‌ వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేయాలి.  

శిక్షలు ఇలా

  • తెలంగాణ ర్యాగింగ్‌ నిషేధ చట్టం 1997(చట్టం 26-1997) ప్రకారం ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా శిక్షార్హులు
  • నేరం రుజువైతే కొంతకాలం జైలుశిక్ష, విద్యాసంస్థల నుంచి తొలగింపు.
  • ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని మరే ఇతర కళాశాలల్లో ప్రవేశాలు పొందకుండా డిబార్‌ చేస్తారు.

ర్యాగింగ్‌ వ్యతిరేక దినోత్సవం...

ఈ ఏడాది నుంచి ఏటా ఆగస్టు 12ను ర్యాగింగ్‌ నిషేధిత దినోత్సవంగా కళాశాలలు జరపాలని యూజీసీ కోరింది. పోలీసులు, నిపుణులను క్యాంపస్‌కు ఆహ్వానించి ఈ మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని వివరించాలి.

  •  గత మార్చిలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వరంగల్‌ నిట్‌లో ర్యాగింగ్‌పై  అవగాహన సదస్సు జరిగింది. డీసీపీ పుష్ప పాల్గొని విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.

గతంలో సంఘటనలు

  • కేఎంసీలో మొదటిసారి 2009లో ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థులపై కేసు నమోదైంది.
  • 2014లో ఇద్దరు సీనియర్‌ విద్యార్థులను కళాశాల నుంచి ఆరునెలల పాటు బహిష్కరించారు.
  • 2021లో ఉత్తరాదికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి బంధువైన విద్యార్థి బాధితుడు. కేంద్రస్థాయిలో ఒత్తిడి రావడంతో లోలోపలే దాన్ని దాచిపెట్టి సర్దుకునేలా చేశారు.
  • అదే సంవత్సరం నవంబరులో మద్యం మత్తులో ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఓ విద్యార్థి ప్రధానితోపాటు అనేక మందికి ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు. 
  • గత ఫిబ్రవరి 22న అనస్థీషియా ప్రథమ సంవత్సరం పీజీ విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఎంజీఎంలో సీనియర్‌ పీజీ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ అదేనెల 26న మృతి చెందారు.

భద్రత పెంచాం

డాక్టర్‌ మోహన్‌దాసు, ప్రిన్సిపల్‌, కేఎంసీ

కేఎంసీలోకి ర్యాగింగ్‌ నివారించేందుకు సెక్యూరిటీని పెంచాం. 5 వసతిగృహాలను కలుపుతూ ప్రహరీ నిర్మించాం. రాకపోకలకు ఒకేదారి ఏర్పాటు చేసి, ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి లోపలకు పంపించేలా చర్యలు చేపట్టాం. ఆలిండియా కోటాలో రాజస్థాన్‌, తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఇక్కడి విద్యార్థులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అందరూ కలిసిపోయేలా కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నాం.


పెత్తనం చేయడం ర్యాగింగ్‌

ఏవీ రంగనాథ్‌,  సీపీ, వరంగల్‌

సీనియర్లు జూనియర్లపై పెత్తనం చేయడం ర్యాగింగ్‌ కిందకు వస్తుంది. అలాంటి ఏ ఘటనలు జరిగినా కేసులు పెడుతున్నాం. విద్యార్థులు సుహృద్భావ వాతావరణంలో ఒకరితో ఒకరు మమేకం కావాలి. తమకు ఫిర్యాదు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అనవసరంగా విద్యార్థులు భవిష్యత్తు పాడుచేసుకోవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని