logo

నారీశక్తికి వందనం..

మహిళలు సంఘటితంగా ఏర్పడి పొదుపు బాట పట్టారు. తమ సంపాదనలో కొంత డబ్బు పొదుపు చేస్తూ ప్రగతి సాధించారు. సంఘాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు పంచసూత్రాలు పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించారు.

Published : 21 Sep 2023 03:00 IST

భీమదేవరపల్లి భరతమాత మండల సమాఖ్యకు జాతీయ గుర్తింపు  

ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న సమాఖ్య మహిళలు, అధికారులు

న్యూస్‌టుడే, భీమదేవరపల్లి: మహిళలు సంఘటితంగా ఏర్పడి పొదుపు బాట పట్టారు. తమ సంపాదనలో కొంత డబ్బు పొదుపు చేస్తూ ప్రగతి సాధించారు. సంఘాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు పంచసూత్రాలు పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించారు. అదే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని భరతమాత మండల సమాఖ్యను జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపింది. నాబార్డు, ఏపీమాస్‌ అనే స్వచ్ఛంద సంస్థ (ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్‌) సంయుక్తంగా ఏటా అందించే జాతీయ స్థాయి పురస్కారం 2022-23కు ఎంపికైంది.  

  • స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకొని మహిళలు పంచసూత్రాలు నూరుశాతం పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించారు. రుణాల మంజూరు, చెల్లింపులో వందశాతం రికవరీ సాధించారు.. ప్రతి నెల గ్రామ, మండల స్థాయిలో పంచసూత్రాల అమలులో భాగంగా సమావేశాలు, క్రమశిక్షణ, పొదుపులు, రుణాల చెల్లింపులు, పుస్తక నిర్వహణ, పారదర్శకత అమలు చేయడంలో తమకు తామే సాటిగా మండల సమాఖ్య నిరూపించుకుంది. సభ్యులు ప్రతి నెల పొదుపు నిధులతోపాటు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను తీసుకొని స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. కొందరు మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని తాము తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్‌ చేస్తూ లాభాలు గడిస్తూ ఆర్థిక ప్రగతి సాధించారు. పాఠశాల దుస్తులు, ఫినాయిల్‌, సర్ఫ్‌, పచ్చళ్లు, నార సంచుల తయారీ, ధాన్యం కొనుగోలు, మినీ డెయిరీ, రైతు ఉపకరణాల అద్దె కేంద్రం ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధించారు. ప్రభుత్వం రూ.26 లక్షల రాయితీలో అందించిన వ్యవసాయ పరికరాలను రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.1.40 లక్షలు సాధిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో కొత్తకొండ, వంగర సంఘాలు రూ.5 లక్షలకుపైగా ఆదాయం పొందారు. సమాఖ్య పరిధిలో సామాజిక కార్యక్రమాలు గుప్పెడు బియ్యం, వరద బాధితులకు దుస్తుల అందజేత, ఆహారంతో ఆరోగ్యం, కరోనా సమయంలో మాస్కుల పంపిణీ  చేపట్టి ప్రశంసలు అందుకున్నారు.
  • అధికారులు, మండల సమాఖ్య పాలకవర్గ సభ్యుల సమన్వయంతో సంఘాల పటిష్టతకు చేస్తున్న సేవలకు ఈ గుర్తింపు వచ్చిందని భరతమాత మండల సమాఖ్య అధ్యక్షురాలు పోలు రజిత  అన్నారు.

పురస్కారం రావడం అభినందనీయం

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: మహిళలు ఆర్థికాభివృద్ధితోపాటు సాధికారత సాధించాలని ఏపీడీ శ్రీనివాస్‌ సూచించారు. బుధవారం భీమదేవరపల్లి మండల కేంద్రంలో భారతమాత మండల సమాఖ్య 19వ వార్షిక మహాసభ  జరిగింది.  ఆయన మాట్లాడుతూ మహిళ సంఘాల సమష్టి కృషితో జాతీయ స్థాయి పురస్కారం రావడం అభినందనీయమన్నారు. సంఘాల అధ్యక్షులు, పాలకవర్గం మరింత బాధ్యతగా పని చేసి మహిళాభ్యున్నతికి కృషి చేయాలన్నారు.   సంఘాల అధ్యక్షులు, వీఓలకు యూనిఫాం, సమావేశానికి కార్యాలయాల నిర్మాణం తదితర సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వయోజనుల ఓటు హక్కు వినియోగంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎం దేవానంద్‌, డీపీఎం అనిల్‌, ప్రకాశ్‌తోపాటు సీసీలు, సమాఖ్య పాలకవర్గ సభ్యులు, గ్రామైఖ్య సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని