logo

దేవాదాయ శాఖకు సొంత భవనం

కొన్నేళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ ఉప కమిషనర్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయాలకు సొంత భవనం సిద్ధమైంది.

Published : 21 Sep 2023 03:00 IST

ప్రారంభోత్సవానికి ముస్తాబైన సమీకృత భవనం

రామన్నపేట, న్యూస్‌టుడే: కొన్నేళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ ఉప కమిషనర్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయాలకు సొంత భవనం సిద్ధమైంది. సుమారు రూ.3 కోట్ల నిధులతో వరంగల్‌ నగరంలో ధార్మిక భవనం ముస్తాబైంది. ఆలయాన్ని పోలిన కట్టడాలు, ప్రధాన ద్వారంలో కాకతీయ శిలాతోరణం పనులు ఆకట్టుకుంటున్నాయి. శ్రీభద్రకాళి దేవస్థానం, మడికొండ శ్రీమెట్టు రామలింగేశ్వరాలయం, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం ద్వారా రూ.కోటి చొప్పున నిధులు సమకూర్చారు. కొత్త భవనంలో ఉపకమిషనర్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌, మేడారం కార్యనిర్వహణాధికారి కార్యాలయాలు ఉంటాయి. వరంగల్‌ పాత సెంట్రల్‌ జైలు ఎదురుగా, రంగంపేట పోలీసు క్వార్టర్స్‌ వద్ద ఈ సమీకృత భవనం నిర్మించారు.

నేడు మంత్రుల పర్యటన : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 8 గంటలకు హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, 8.30 గంటలకు భద్రకాళి ఆలయంలో పూజలు చేస్తారు. 9 గంటలకు దేవాదాయశాఖ సమీకృత భవనాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 12 గంటలకు మేడారం వెళ్తారు. రూ.6 కోట్లతో పరిపాలన భవనం, రూ.2 కోట్లతో అతిథుల కోసం డార్మెట్రీ హాల్‌, రూ.1.50 కోట్లతో పూజారి అతిథి గృహం, రూ.1.06 కోట్లతో శుభ మండపం, కన్నెపల్లిలో రూ.94 లక్షలతో సారలమ్మ పూజా మందిరం, రూ.50 లక్షలతో జంపన్న వాగు పరిసరాల ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేస్తారని వరంగల్‌ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖాధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని