logo

గాల్లోకి కాల్పులు జరిపిన బిల్డర్‌

పరకాలలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో ఓ బిల్డర్‌ తన లైసెన్స్‌ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...

Published : 21 Sep 2023 03:00 IST

పరకాల, న్యూస్‌టుడే: పరకాలలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో ఓ బిల్డర్‌ తన లైసెన్స్‌ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఈ నెల 15న ఆ గార్డెన్‌లో నగేష్‌ అనే వ్యక్తి తన తండ్రి సంవత్సరీకాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అతని బంధు మిత్రులు, స్థానికులతో పాటు పరకాల వాసి, హనుమకొండలో ఉంటున్న బిల్డర్‌ క్రేడై రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి హాజరయ్యారు. అతను కొంత మందితో కలిసి వేడుకల మందిరం గేట్‌ సమీపంలో కూర్చున్నారు. ఆ సమయంలో రాజకీయ పరమైన అంశాలు చర్చకు వచ్చి అక్కడున్న వారి మధ్య వాదనలు జరిగాయి. ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ స్థానిక నేతలు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బిల్డర్‌ తిరుపతిరెడ్డి ఆగ్రహించారు. తాను అసంతృప్తిగా ఉన్నానని, సమయం వచ్చినప్పుడు చూసుకుంటానని అన్నారు. దీనిపై గొడవ జరగడంతో ఆవేశంగా తన వద్ద ఉన్న లైసెన్స్‌ తుపాకీతో గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పులతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  విషయాన్ని బయటకు తెలియకుండా ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.  బుధవారం సాయంత్రం వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో పోలీసులు ఆర్‌ఆర్‌ గార్డెన్‌కు చేరుకొని కాల్పులపై ఆరా తీశారు. దీనిపై బిల్డర్‌ ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా ఎలాంటి గొడవ జరగలేదని, లాక్‌తీసి ఉన్న తుపాకీని జేబులో నుంచి తీస్తుండగా మిస్‌ఫైర్‌ అయిందన్నారు. ఈవిషయాన్ని పోలీసులకు కూడా చెప్పానన్నారు. సీఐ వెంకటరత్నం మాట్లాడుతూ వాట్సప్‌లో వచ్చిన వివరాల ప్రకారం గన్‌ఫైర్‌పై కేసు నమోదు చేశామన్నారు. రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తుండగా విచారణ చేపట్టామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని