logo

ఎదుగుదల లేని పంటలు

వర్షాభావ పరిస్థితులు అన్నదాతను కలవరపెడుతున్నాయి. వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.

Published : 22 Sep 2023 05:15 IST

హసన్‌పర్తి మండలం మడిపల్లిలో..

వరంగల్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: వర్షాభావ పరిస్థితులు అన్నదాతను కలవరపెడుతున్నాయి. వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో సమతుల్యత లోపించింది. కురిస్తే కుంభవృష్టి లేదంటే అనావృష్టి. ఈ రెండింటితోనూ పంటలకు నష్టమే. సమయానికి వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. అనవసర వేళ కుంభవృష్టితో రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. వానాకాలం సీజన్‌లో జులైలో అధిక వర్షపాతం, జూన్‌, ఆగస్టులో తక్కువ వర్షపాతం నమోదై పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. పత్తి, మొక్కజొన్న పూత కాత వచ్చినా.. బలంగా లేవు. సెప్టెంబర్‌లో అడపాదడపా పడటం కొంతమేర పంటలకు మేలు జరుగుతోంది. బోర్లు, బావులున్న వారికి ఇబ్బంది లేదు. వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు వేసవిని తలపించేలా భగ్గు మని ఆరుతడి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు నష్టం వాటిల్లుతోంది. నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి.

ప్రకృతి వైపరీత్యం..

సాధారణ సాగు విస్తీర్ణం 2,42,000 ఎకరాలు కాగా 2,32,290 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. జులైలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 1,084 ఎకరాల్లో పత్తి, వరి పంటలకు నష్టం జరిగింది. నష్టం విలువ రూ.1.08 కోట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పుడు వర్షాభావంతో పంటలు ఎండి పోతున్నాయి. ఈ వానాకాలం సీజన్‌లో ఆగస్టులో ఏర్పడిన అనావృష్టి సాగును దెబ్బతీసింది. సెప్టెంబర్‌ 21వ తేదీ వరకు లోటు వర్షపాతం ఉంది. జూన్‌, జులైల్లో సాగుచేసిన పంటలు ఆగస్టులో ఎదుగుదలకు వస్తాయి. ఈ సమయంలోనే ఆశించిన మేర వర్షాలు కురవలేదు. ప్రధానంగా జిల్లాలోని భీమదేవరపల్లి, వేలేరు, ఎల్కతుర్తి, కమలాపూర్‌, హసన్‌పర్తి, ధర్మసాగర్‌, పరకాల, శాయంపేట, అత్మకూరు మండలాల్లో లోటు వర్షపాతం కారణంగా పంటలకు ఇబ్బంది ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులకు తోడు పత్తి పంటపై పలు రకాల చీడపీడలు ఆశించి పూత, పిందేలకు నష్టం కల్గుతోంది.

జిల్లాలో మోస్తరు వర్షం

జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో పదిరోజుల నుంచి ఎండ వేడిమికి తల్లడిల్లుతున్న జనానికి ఉపశమనం లభించింది.  గురువారం ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఐనవోలులో 33.6 మి.మీ, వేలేరులో 21.3, కాజీపేటలో 15.2, శాయంపేటలో 12.7, ఆత్మకూరులో 9.7, భీమదేవరపల్లిలో 8.1, కమలాపూర్‌లో 7.1, పరకాలలో 6.4, దామెర 5.0, ఎల్కతుర్తిలో 3.0 నడికుడలో 3.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

మొక్కజొన్నకు తీవ్ర నష్టం

తోట రవీందర్‌. సింగారం

వర్షాధారంగా రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. జులై వరకు బాగానే పెరిగింది. ఆగస్టులో వర్షాలు లేక పోవడంతో గిడిసబారిపోయింది. రెండు మూడు అడుగుల వరకు పెరిగి పూత,పీచు వచ్చింది. దీంతో పంటను తీసివేశాను. రెండో పంటగా కూరగాయల సాగు చేసేందుకు పొలాన్ని సిద్ధం చేసుకున్నాను.

పత్తి పంటలో సమస్యలు

చాగంటి శ్రీనివాస్‌. మల్లక్‌పల్లి

ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పత్తి పంటలో సమస్యలు ఎక్కువయ్యాయి. పత్తి మొక్కలు కేవలం రెండు అడుగుల లోపే పెరిగి పూత, కాత వస్తుంది. దీంతో కనీస దిగుబడి రాదు. పలురకాల తెగుళ్లు, చీడపురుగుల దాడి పెరిగింది. పూత, కాత రాలిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు