logo

కాటికెళ్లినా తప్పని పాట్లు!

చివరి మజిలీలోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. బంధువులు, కుటుంబ సభ్యుల అంత్యక్రియల కోసం శ్మశానవాటికలకు వెళ్లిన వారికి అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

Published : 22 Sep 2023 05:15 IST

జనగామలోని శ్మశానవాటికలో అసంపూర్తిగా కట్టడాలు

జనగామ, న్యూస్‌టుడే: చివరి మజిలీలోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. బంధువులు, కుటుంబ సభ్యుల అంత్యక్రియల కోసం శ్మశానవాటికలకు వెళ్లిన వారికి అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మృతుల ఆఖరి ప్రయాణం గౌరవంగా జరగాలన్నది అందరి ఆకాంక్ష. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో, పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. శ్మశాన వాటికల్లో తగిన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను సమకూరుస్తోంది. పల్లెకో వైకుంఠధామం ఉండేలా చర్యలు చేపట్టింది. పురపాలికలు, నగరపాలికల్లో ఆదర్శ వైకుంఠ ధామాల నిర్మాణానికి రూ.కోటి చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని వైకుంఠధామాల పరిస్థితి, సదుపాయాలపై గురువారం ‘ఈనాడు’ పరిశీలన చేపట్టింది.

పట్టణాల్లో అధ్వానం

జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఉన్నాయి. కొందరు మృతదేహాలను ఖననం చేస్తుండగా.. మరికొందరు దహనం చేసే సంప్రదాయం ఉంది. కొందరు చెరువులు, కుంటల సమీపంలో, కొందరు సొంత వ్యవసాయ భూముల వద్ద  త్యక్రియలు  నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆరు హిందు, ఒక క్రైస్తవ, ఒక ముస్లిం, మైనార్టీ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున శ్మశాన వాటికలున్నాయి. ప్రిస్టన్‌ విద్యాలయం వెనుక క్రైస్తవులకు నిర్దేశించిన ఆఖరి మజిలీకి రూపం లేదు. స్థలం ఆక్రమణల పాలైంది. ఉన్న కొద్ది పాటి స్థలంలో వాటిక అభివృద్ధికి రూ.10 లక్షలతో పనులు ప్రతిపాదించి ఏళ్లు గడుస్తున్నా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి..

 నెహ్రూపార్కు సమీపంలోని శ్మశానవాటికలో జనగామ లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో కొన్ని పనులు, మున్సిపల్‌ ఆధ్వర్యంలో ప్రహరీ, సీసీ రోడ్లు, దహన వేదికలను నిర్మించారు. రూ.20 లక్షలతో కరోనా సమయంలో గ్యాస్‌ ఆధారిత దహనవాటికను నిర్మించారు. మరో రూ.10 లక్షలను ఇతర పనులకు ఖర్చు చేసినా వాడుకలో లేవు. గతంలో నిర్మించిన స్నానఘట్టం, మూత్రశాలలు, అస్థికలను భద్రపర్చే గది నిర్వహణ లేక అధ్వానంగా ఉన్నాయి.  చినుకుపడితే జలమయంగా మారుతున్నాయి. రూ.కోటితో శ్రీరాంనగర్‌ మూలోని కుంటలో చేపట్టిన వైకుంఠధామం నిర్మాణ పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. సుమారు రూ.50 లక్షల పని జరిగినా, రూపాయి బిల్లు రాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గోరీలగడ్డ వాటిక ఇళ్ల మధ్యలో ఉందని తాళం వేశారు. ధర్మకంచ, మార్కెట్‌యార్డు వెనుక వైకుంఠధామాల్లో సమస్యలు ఉన్నాయి.


నీటి సౌకర్యం లేక ఇబ్బందులు

కొడకండ్లలో ట్యాంకు లేని గద్దె

కొడకండ్ల, న్యూస్‌టుడే: కొడకండ్ల మండలం జీబీ తండా, లక్ష్మక్కపల్లి, పాఖాల, రంగాపురంలోని వైకుంఠధామాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో ప్రజలు వారికి అనుకూలమైన స్థలాల్లో అంత్యక్రియలు కొనసాగిస్తున్నారు. చెరువుముందు తండాలోని వైకుంఠధామం చెరువు మధ్యలో ఉండడంతో దారి లేదు. కొడకండ్లలో శ్మశానవాటికను వాగు ఒడ్డున నిర్మించడంతో.. వరద ఉద్ధృతికి ప్లాస్టిక్‌ ట్యాంక్‌ కొట్టుకు పోయింది. నీటి వసతి లేకపోవడంతో పక్కనున్న వాగు నీటితోనే ప్రజలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కొడకండ్ల, రామేశ్వరం, మైదం చెరువుతండా, ఏడునూతుల  వైకుంఠధామాల్లో విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో బోరు నీటిని వినియోగించుకునే పరిస్థితి లేదు.  


జల దిగ్బంధంలో..

మన్‌పహాడ్‌లో వర్షపు నీటిలో వైకుంఠధామం

దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: దేవరుప్పుల మండలం మన్‌పహాడ్‌కు చెందిన వైకుంఠధామాన్ని చెరువు శివారులో నిర్మించారు. చెరువు నిండిన ప్రతిసారీ వైకుంఠధామం చుట్టూ నీరు చేరుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో యశ్వంతాపూర్‌ వాగులో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.  అధికారులు స్పందించి వైకుంఠధామం చుట్టూ ఎత్తుగా కట్టను నిర్మిస్తే ఉపయోగంలోకి వస్తుందని గ్రామస్థులు కోరుతున్నారు.


తలుపులు లేని స్నానపు గదులు

పోచన్నపేటలో..

బచ్చన్నపేట, న్యూస్‌టుడే: బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో.. నారాయణపురానికి వెళ్లే రహదారిలోని శ్మశానవాటికలో స్నానాల గదులకు తలుపులు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చి మొక్కలు బాగా పెరిగాయి.  అధికారులు స్నానాల గదులకు తలుపులు ఏర్పాటు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి

జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలున్నాయి. నీరు, విద్యుత్తు సదుపాయాలున్నాయి. దహన క్రియలకు అనుమతి ఉంది. ఖననం, సమాధి నిర్మాణాలకు అవకాశం లేదు. పటేల్‌గూడెంలో వర్షానికి దెబ్బతిన్న శ్మశానవాటిక పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

రంగాచారి, డీపీవో


సమస్యను ఎమ్మెల్యేకు వివరిస్తాను

జనగామలో వైకుంఠధామాల విషయంపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. ఆదర్శ వైకుంఠధామం పనులు, నిధుల విడుదల విషయాలను  ఎమ్మెల్యేకు వివరిస్తాను.

 జమున, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని