logo

‘కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు’

అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.

Published : 22 Sep 2023 05:15 IST

ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ మండలం యశ్వంతాపూర్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు. సాగునీటి కల్పన, మిషన్‌ భగీరథ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. జిల్లాకో వైద్య కళాశాల దేశంలో ఎక్కడా లేదని, కేవలం తెలంగాణలో మాత్రమే సాధ్యమైందన్నారు. అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా అభివృద్ధిలో ముందున్నామన్నారు. తలసరి విద్యుత్తు వినియోగంలో కూడా రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో ఏటా రెండు పంటలకు 3 కోట్ల టన్నుల వరి ధాన్యం దిగుబడి సాధిస్తూ పంజాబ్‌ వంటి రాష్ట్రాన్ని కూడా దాటామన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు హామీలను ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. భాజపాకు తెలంగాణలో అసలు ఉనికే లేదన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్క శాసనసభ స్థానం కూడా గెలిచే పరిస్థితిలో భాజపా లేదన్నారు. ప్రతిసారీ ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్ముతున్నారన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తన అభ్యర్థిత్వం ఖరారు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్య గురించి విలేకరుల ప్రశ్నించగా.. ‘పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి పని చేయాలన్నారు.. భారాస పార్టీ నీటితో నిండిన చెరువు మాదిరిగా ఉందని, కొన్ని చేపలు బయటకు వెళ్లిపోతాయన్నారు. సమావేశంలో జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎడవెల్లి కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు ఇల్లందుల బేబీ, ఎంపీపీ చిట్ల జయశ్రీ, నాయకులు బెలిదె వెంకన్న, చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, యాదగిరి, లింగారెడ్డి, సారంగపాణి, బ్రహ్మారెడ్డి, శంకర్‌, కందుకూరి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని