logo

అడవిపై గొడ్డలి వేటు

తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉద్యమంగా నిర్వహిస్తోంది.

Published : 22 Sep 2023 05:15 IST

కేశవాపూర్‌ సమీపంలో నేలకొరిగిన వృక్షాలు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహాముత్తారం, న్యూస్‌టుడే : తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉద్యమంగా నిర్వహిస్తోంది. ఇటీవల పోడుదారులకు హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చారు. ఇక పోడు జరగొద్దని, అడవులను కాపాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కానీ, ప్రభుత్వ ఉద్దేశాన్ని లెక్కచేయకుండా కొందరు అడవులను యథేచ్ఛగా నరుకుతూ పోడు భూములుగా మార్చుతున్నారు. తాజాగా మహాముత్తారం మండలం కేశవాపూర్‌ సమీపంలోని పెద్దవాగు లోలెవల్‌ వంతెనకు అతిదగ్గరలో కాటారం-మేడారం ప్రధాన రహదారి పక్కనే అడవిలో పెద్దఎత్తున చెట్లు నరికారు. దాదాపు 3 ఎకరాల్లో అడవిని నాశనం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎక్కడో అడవి మధ్యలో చేసింది కాదు. ప్రధాన రహదారి వెంట ఇంత పెద్దఎత్తున అడవిని నరకడం చర్చనీయాంశంగా మారింది. చెట్లను నరికిన ప్రదేశంలోనే అడవుల సంరక్షణ బోర్డు ఉండటం విశేషం.

తెరవెనుక కొందరు : ఇక్కడి అడవులను నరికింది గొత్తికోయలుగా అధికారులు గుర్తించారు. కానీ, సమీప గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తెరవెనుక చక్రం తిప్పుతూ గొత్తికోయలను ముందుంచి పోడుకు పాల్పడినట్లు తెలిసింది. రహదారి వెంట భూములకు డిమాండ్‌ వస్తుందనే వక్రబుద్ధితో అక్రమార్కులు అమాయకులతో పోడు చేయించినట్లు సమాచారం. ఈ విషయమై మహదేవపూర్‌ ఎఫ్‌డీవో వజ్రారెడ్డిని సంప్రదించగా అడవిని నరికిన 8 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. దీని వెనుక బయటి వ్యక్తులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దానిపైనా విచారణ చేస్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని