logo

పల్లెలు మెరవాలి.. పట్టణాలు మురవాలి

2017లో గాంధీ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా హీ సేవ మొదలెట్టారు. ఏటా ఇది అమలవుతోంది.

Updated : 22 Sep 2023 05:59 IST

అమ్మపాలెంలో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ

డోర్నకల్‌, న్యూస్‌టుడే: 2017లో గాంధీ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా హీ సేవ మొదలెట్టారు. ఏటా ఇది అమలవుతోంది. ఈసారి కూడా దీనిని పకడ్బందీగా నిర్వహించాలని సంకల్పించి జిల్లాలో 15వ తేదీన శ్రీకారం చుట్టగా అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగనుంది. గతంలో నిర్వహించిన కార్యాచరణ ద్వారా జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కింద 15 పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు పొందగా ఒకటి రాష్ట్ర స్థాయి పురస్కారం కైవసం చేసుకుంది. ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఇప్పుడు పల్లెలు మెరవాలి..పట్టణాలు మురవాలనే లక్ష్యంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రజలలో విస్తృతంగా తీసుకెళుతున్నారు. ర్యాలీలు, ప్రతిజ్ఞలతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ నిర్వహణలో గురువారం మధ్యాహ్నం 12 గంటల నాటికి రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో ఉంది.

పక్కా ప్రణాళికతోనే గుర్తింపు

స్వచ్ఛతా హీ సేవా అమల్లో భాగంగా పల్లెలు, పట్టణాలలో ప్రభుత్వం నిర్దేశించిన రహదారుల శుభ్రం, కాలువల్లో మురుగు నీరు తొలగింపు, నిత్యం చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ, ప్లాస్టిక్‌ నిషేధంపై చైతన్యం, కూడళ్లు గోడలపై కనువిప్పు కలిగించేలా చైతన్యం రగిల్చారు. అప్పట్లో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములయ్యారు. ఫలితంగా బయ్యారం మండలంలోని కొత్తపేట పంచాయతీ రాష్ట్ర స్థాయిలో పురస్కారం పొందగా జిల్లా స్థాయిలో డోర్నకల్‌ మండలం-చాప్లాతండా, వెన్నారం, కురవి మండలం-కొత్తూరు(జి), కురవి, నర్సింహులపేట మండలం-రామన్నగూడెం, గూడూరు మండలం-ఏపూరు, కేసముద్రం మండలం-కేసముద్రం స్టేషన్‌, నెల్లికుదురు మండలం-ఆలేరు, మరిపెడ మండలం-బీచురాజిపల్లి, తండా ధర్మారం, ఎల్లంపేట, పెద్దవంగర  మండలం-అవతాపురం, మహబూబాబాద్‌ మండలం-మల్యాల, తొర్రూరు మండలం-ఖాణాపురం, బయ్యారం మండలం-కొత్తపేట గ్రామ పంచాయతీలు అవార్డులు పొందాయి. అదే ప్రేరణతో ముందుకు సాగాలని జిల్లా యంత్రాంగం కృతనిశ్చయంతో ఉంది.

ప్రత్యేక కార్యాచరణ ఇది

 • స్వచ్ఛత ప్రాధాన్యంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన
 • విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహణ
 • పుర/పంచాయతీ పాలకవర్గాలు, అధికార గణం పారిశుద్ధ్య పనుల్లో భాగస్వామ్యం
 • శ్రమదానం చేయాలి
 • ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజల్లో చైతన్య కలిగించాలి
 • మొక్కలు నాటి సంరక్షించుకోవాలి
 • గోడలపై స్వచ్ఛత నినాదాలు రాయాలి
 • ఇంటింటికి తిరిగి చెత్త సేకరించాలి
 • కంపోస్టు షెడ్డులో తడి పొడి చెత్త వేరు చేయడం, సేంద్రీయ ఎరువుగా మార్చే చర్యలు అమలు పరచాలి.

గురువారం మధ్యాహ్నం12 గంటల నాటికి ఇలా..

రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం: 08
నిర్వహించిన కార్యక్రమాలు: 1226
పాల్గొన్న ప్రజలు: 109958
పని చేసిన గంటలు: 260381
అప్‌లోడ్‌ చేసిన : 1216
(స్వచ్ఛతా హీసేవ) ఫొటోలు

జిల్లాలో..

 • పురపాలికలు : 4
 • గ్రామ పంచాయతీలు : 461

ప్రజల భాగస్వామ్యం భేష్‌

 రవి, జిల్లా సమన్వయకర్త, స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌

స్వచ్ఛతా హీ సేవలో ప్రజల భాగస్వామ్యం భేష్‌గా ఉంది. ర్యాలీలు, సదస్సులు, ప్రతిజ్ఞలకు ఊహించని స్పందన కనిపించింది. పురపాలికలు, పంచాయతీల్లో స్వచ్ఛతా హీ సేవ  కార్యక్రమాలను అమలు చేశాం. ఏ రోజుకారోజు స్వచ్ఛతా హీ సేవపై పర్యవేక్షణ ఉంటుంది. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో ముందుకు వస్తుండటం ఒక శుభ పరిణామం. గతంలో వచ్చిన అవార్డులే స్ఫూర్తిగా ముందుకు సాగుతాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని