logo

అన్నదాతలకు ఊరట..!

జిల్లాలో జులైలో ముంచెత్తిన వర్షాలు ఆ తర్వాత పూర్తిగా వెనుకంజ వేశాయి. సాధారణ వర్షపాతం కంటె తక్కువగా నమోదైంది.

Published : 22 Sep 2023 05:15 IST

ములుగు, న్యూస్‌టుడే: జిల్లాలో జులైలో ముంచెత్తిన వర్షాలు ఆ తర్వాత పూర్తిగా వెనుకంజ వేశాయి. సాధారణ వర్షపాతం కంటె తక్కువగా నమోదైంది. దీంతో అన్నదాతలు వర్షాల కోసం  ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి తక్కువగా ఉన్నాయి. జులై మినహాయిస్తే జూన్‌, ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలు నిరాశ కలిగించాయి. ఈ నాలుగు నెలల్లో గతేడాది 58 శాతం వర్షంపాతం నమోదుకాగా, ఈ ఏడాది కేవలం 8 శాతం మాత్రమే నమోదైంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు కొంత ఊరటనిస్తున్నాయి. నీటి వసతి ఉన్న రైతులు పంటలకు బోర్లు, బావుల ద్వారా నీరందిస్తున్నారు. వర్షాధారంతో వేసిన పత్తి, మిరప పంటలకు అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. జిల్లాలో రెండు నెలల్లో అతివృష్టి, అనావృష్టి నెలకొంది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాకపోవడవంతో కర్షకులు బోర్లు, బావులకు అమర్చిన విద్యుత్తు మోటార్లకు పదును పెడుతున్నారు. జులైలో ఊహించని రీతిలో వర్షాలు ముంచెత్తడంతో కుంటలు, చెరువులు పూర్తిగా నిండి జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆ నీరే వరి పంటకు ఆధారమైంది.

1.40 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్‌లో 187.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 176.2మి.మీ సాధారణంతో ఇంచుమించు సమానంగా ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో 380.5 మి.మీ నమోదైంది. సగానికి సగం తేడా ఉండటంతో.. రైతులు కొంతమేర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. 1.10 లక్షల ఎకరాల్లో వరి, 994 ఎకరాల్లో మొక్కజొన్న, 28,980 ఎకరాల్లో పత్తి సాగవుతోంది.

భూముల్లో తేమ తగ్గదు

 గౌస్‌ హైదర్‌, జిల్లా వ్యవసాయాధికారి

ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో వర్షాలు కొంత తక్కువగా కురిసినా.. పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. జిల్లాలో ఎక్కువగా సుమారు 80 శాతం వరి పంట సాగవుతుంది. పత్తి వేసిన భూముల్లో ఇప్పుడే తేమ తగ్గదు. నీటి వసతి ఉన్న రైతులు 30, 60, 90 రోజుల వ్యవధిలో పత్తి పంటలకు ఎకరాకు 40 కేజీల యూరియా, 20 కిలోల పొటాష్‌ వేయాలి. ములుగు, వెంకటాపూర్‌ మండలాల్లో మాత్రమే ఎక్కువగా పత్తి వేశారు. మిగిలిన మండలాల్లో వరి సాగవుతుండగా ఎక్కువగా చెరువులు, కుంటల పరిధిలోనే ఉంది. జిల్లాలో యూరియా కొరత లేదు. నిర్దేశించిన మోతాదు కంటే ఎక్కువ నిల్వలు జిల్లాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని