logo

చినుకులే దిక్కు.. పంటలెలా దక్కు!

ఈ ఏడాది జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కురిస్తే కుంభవృష్టి.. లేదంటే అనావృష్టి అన్నట్లుంది.

Published : 22 Sep 2023 05:57 IST

న్యూస్‌టుడే, వరంగల్‌ వ్యవసాయం, గీసుకొండ, చెన్నారావుపేట: ఈ ఏడాది జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కురిస్తే కుంభవృష్టి.. లేదంటే అనావృష్టి అన్నట్లుంది. రెండు విధాలా అన్నదాతకు నష్టాలు తప్పడం లేదు. వాతావరణంలో లోపించిన సమతుల్యత పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కురవాల్సిన సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. ఈ సీజన్‌ జులైలో సాధారణం కంటే 186 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తరవాత ఆగస్టులో వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రత కూడా పెరిగింది. నీటి తడులు అందకపోవడంతో మొక్కలు గిడసబారాయి. పెరుగుదల లేకుండానే పత్తికి పూత, మొక్కజొన్న కాత వచ్చాయి. ఈ నెలలో అడపాదడప  కురుస్తున్న వర్షాలు పంటలకు కొంతమేరకు మేలు చేస్తున్నాయి.

దెబ్బతీసిన ఆగస్టు....

ఆగస్టులో వర్షాభావ పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. సాధారణం కన్నా 70 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. అలాగే ఈ నెలలో 21వ తేదీ వరకు కూడా 23 శాతం లోటు వర్షపాతమే నమోదు అయింది. వర్ధన్నపేట, ఖిలావరంగల్‌, గీసుకొండ, సంగెం, రాయపర్తి, నర్సంపేట, ఖానాపూర్‌, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లో లోటు వర్షపాతం ఉంది.

ఎదుగుదల లోపించింది

గీసుకొండలో గిడసబారిన మొక్కజొన్న పంట

  • రైతు : పాకనాటి సారయ్య, గీసుకొండ
  • ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు : మొత్తం 11 ఎకరాల్లో సాగు. ఐదెకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో పత్తి, రెండెకరాల్లో వరి.
  • పెట్టుబడి : పత్తి ఎకరానికి రూ.40 వేలు, మొక్కజొన్నకు రూ.30 వేలు, వరికి రూ.30 చొప్పున.
  • ప్రస్తుతం పంటల పరిస్థితి: సరైన వర్షాల్లేక మొక్కజొన్న పంటలో ఎదుగుదల లోపించింది. సాధారణంగా ఎనిమిది అడుగుల ఎత్తు పెరగాల్సిన మొక్క కేవలం నాలుగు అడుగులే పెరిగి, కంకులు చిన్నగా ఉన్నాయి. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిఉండగా.. క్వింటాళ్లు మించేపరిస్థితి లేదు. పత్తి చేలు మొదట దెబ్బతిన్నా తరవాతి వర్షాలకు కోలుకుంది.

ఎరుపు రంగు తెగులు..

ఎర్రబారిన పత్తి పంట

  • బానోత్‌ నర్సింహ, అమృతండా (చెన్నారావుపేట)
  • 1.10 ఎకరాల్లో పత్తి
  • ఎకరాకు రూ.30 వేలు
  • మొదట్లో వర్షాల్లేక వేసిన విత్తనాలు మొలకెత్తక నష్టం వాటిల్లింది. తరవాత భారీ వర్షాలతో మొక్కలు కొట్టుకుపోయాయి. మిగిలిన మొక్కలకు ఎరువులు వేసి బతికించుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంటలో కలుపు అధికంగా పెరిగింది. ఎర్రతెగులు సోకి ఆకులు ఎర్రబారాయి. మొక్కల ఎదుగుదల ఆగిపోయింది.

కోలుకునే పరిస్థితి లేదు..

 

ఉడుత రమేష్‌, నల్లబెల్లి

  • ఐదున్నర ఎకరాల్లో పత్తి. వరుస వర్షాలతో రెండెకరాల్లో జాలు పట్టి పంట పనికి రాకుండా పోయింది. 
  • రూ.1 లక్ష 
  • గతంలో వడగండ్ల వానలతో పంట నష్టపోయారు. ఇటీవల వర్షాలు వరుసగా కురుస్తుండటంతో పొలం జాలుపట్టి పంట ఎదుగుదల లేకుండా పోయింది. మిగిలిన మూడున్నర ఎకరాల్లో మొక్కల ఎదుగుదల లేదు. దిగుబడి రాక పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. తెగుళ్లు సోకాయి.

జిల్లాలో మోస్తరు వర్షం

వరంగల్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే:  వరంగల్‌ జిల్లాలో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణం కూడా చల్లబడింది. గత పదిరోజుల నుంచి ఎండలతో అవస్థలు పడుతున్న జనానికి ఉపశమనం కలిగింది.

24 గంటల్లో మండలాల్లో కురిసిన వర్షం (మి.మీటర్లలో..)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని