logo

దేవాలయాలకు మహర్దశ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో వందలాది దేవాలయాలు మహర్దశ సంతరించుకున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

Updated : 22 Sep 2023 06:02 IST

ధార్మిక భవనం ప్రారంభోత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ తదితరులు

రంగంపేట, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో వందలాది దేవాలయాలు మహర్దశ సంతరించుకున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి వరంగల్‌, హనుమకొండ, ములుగు జిల్లాల్లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్‌ నగరంలో రూ.4.15 కోట్లతో నిర్మించిన ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సమీకృత ధార్మిక భవనాన్ని ఉదయం ప్రారంభించారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ధార్మిక భవన్‌లో పూజలు చేశారు. సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే సరిపడా అర్చక, ఉద్యోగులను నియమిస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ యాదాద్రి ప్రాజెక్టులో పనిచేసిన అర్కిటెక్చర్లను వరంగల్‌ శ్రీభద్రకాళి దేవాలయం మాడవీధుల డిజైన్లకు వినియోగించాలని సూచించారు. పాలకుర్తిలో పురాతన శివాలయాన్ని అభివృద్ధి పరిచేందుకు సహకారం అందించాలని కోరారు.  మంత్రి సత్యవతి రాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దే పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. నూతన భవనంలో శ్రీభద్రకాళి వేద విద్యాలయానికి ఒక అంతస్తు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాష్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బొయినపల్లి వినోద్‌కుమార్‌, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, హనుమకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌, ఆర్‌జేసీ రామకృష్ణ్ణారావు, వరంగల్‌ ప్రాంతీయ ఉపకమిషనర్‌ శ్రీకాంతరావు, జిల్లా సహాయ కమిషనర్‌ రామల సునీత, ‘కుడా’ ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌, స్థానిక కార్పొరేటర్‌ విజయలక్ష్మితో పాటు అధికారులు, ఈవోలు, ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు.


భద్రకాళి, రుద్రేశ్వరాలయం సందర్శన

రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ గురువారం ఉదయం హనుమకొండ వేయిస్తంభాల ఆలయం, శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. వేయిస్తంభాల ఆలయంలో వారికి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గణపతికి పూజ చేసిన అనంతరం రుద్రేశ్వరుడికి పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.  


దసరా తర్వాత మేడారం జాతర పనులు

మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు పూజలు చేస్తూ..

మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మహాజాతర పనులన్నీ దసరా పండగ తర్వాత ప్రారంభమవుతాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యావతిరాథోడ్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, రెడ్కో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి, ఎస్పీ గాస్‌ ఆలం, ఐటీడీఏ పీవో అంకిత్‌, డీఎఫ్‌వో రాహుల్‌జాదవ్‌తో కలిసి  మేడారంలో పర్యటించి మహాజాతర ఏర్పాట్లపై సమీక్షలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ అతిథిగృహానికి శంకుస్థాపన చేశారు. వనదేవతలను దర్శించుకొన్నారు.

నిర్వహణ బాధ్యత కలెక్టర్‌దే: 2024లో జరిగే వనదేవతల మహాజాతర నిర్వహణ బాధ్యత మొత్తం జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఇతర అధికారులదేనన్నారు. జాతర ఏర్పాట్లపై స్థానిక అతిథిగృహంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీరు, దేవతల దర్శనం, ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మరో నెలరోజుల్లో ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉందని, అప్పుడు పరిపాలన మొత్తం అధికారయంత్రాంగం చేతిలో ఉంటుందన్నారు.


ఐదో జాతరను దిగ్విజయంగా నిర్వహిస్తాం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో గత నాలుగు పర్యాయాలుగా రూ.400కోట్లు వెచ్చించి వనదేవతల జాతరను దిగ్విజయంగా నిర్వహించామని, ఈసారీ  ఏ చిన్న లోపం జరగకుండా చూస్తామని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యావతిరాథోడ్‌ అన్నారు. ఈసారి జాతర ఏర్పాట్లకోసం రూ.80 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖకు రూ.13.24 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రూ.2.15 కోట్లతో అతిథిగృహం పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, జడ్పీటీసీ సభ్యుడు తుమ్మల హరిబాబు, ఎంపీపీ గొంది వాణిశ్రీ, సర్పంచి చిడం బాబురావు, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని