logo

డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా.. నిట్‌ విద్యార్థిని దుర్మరణం

ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న దుర్ఘటనలో వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌) విద్యార్థిని అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Updated : 22 Sep 2023 09:32 IST

మరో ఐదుగురికి తీవ్ర గాయాలు

సంఘటన స్థలంలో ఆగి ఉన్న లారీ వద్ద నుజ్జునుజ్జు అయిన కారు

ఈనాడు, వరంగల్‌, ములుగు, బాలసముద్రం, న్యూస్‌టుడే: ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న దుర్ఘటనలో వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌) విద్యార్థిని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిట్‌లో బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఏలూరు జిల్లా లింగపాలెం మండలం దర్మాజిగూడెం గ్రామానికి చెందిన తాడెపల్లి నిస్సి (18), విజయవాడకు చెందిన శ్రేయ, హైదరాబాద్‌కు చెందిన ముర్తుజా, ఉమర్‌, సాయి, సుజిత్‌లు మొత్తం ఆరుగురు బుధవారం రాత్రి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారులో ములుగు జిల్లా లక్నవరం బయలుదేరి వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ములుగు మండలం జంగాలపల్లి గ్రామం వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌కు ఢీ కొట్టింది. అతివేగంతో డివైడర్‌ను  ఢీకొన్న కారు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభానికి ఢీ కొట్టగా అది విరిగిపోయింది. అక్కడితో ఆగకుండా పల్టీలు కొట్టుకుంటూ డివైడర్‌ అవతలివైపున ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో తాడెపల్లి నిస్సి మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఐదుగురిలో ముగ్గురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగ్రాలను మూడు 108 వాహనాల్లో ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి వరంగల్‌ ఎంజిఎంకు తీసుకెళ్లారు. అనంతరం వీరిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిస్సి మృతదేహాన్ని ములుగు జిల్లా ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. క్షతగాత్రులు తెలిపిన సమాచారం ప్రకారం వాకి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

టాక్సీ కారు అనుమతి లేకుండా?

  నిస్సిని చూసేందుకు ములుగు జిల్లా ఆసుపత్రికి చేరుకున్న సహచర విద్యార్థులు

ఆరుగురు విద్యార్థులు బుధవారం రాత్రి వేళ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారులో నిట్ ప్రాంగణం నుంచి ములుగు జిల్లా లక్నవరం వెళ్లడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లు తీసుకెళ్లిన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు నిర్వాహకులు అనుమతి లేకుండా నడిపిస్తున్నట్టు సమాచారం. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు నడిపేవారు ప్రత్యేక నెంబర్‌ ప్లేట్ వేసుకోవాలి. వీరు తీసుకెళ్లిన స్విఫ్ట్‌ డిజైర్‌ వాహనం ఓనర్‌ నెంబరు ప్లేట్తో ఉంది. సాయంత్రం 6 గంటల తర్వాత లక్నవరం చూడడానికి అనుమతించరు. మరి అర్ధరాత్రి విద్యార్థులు లక్నవరం బయలుదేరి అక్కడ బస చేసి తిరిగి మర్నాడు సందర్శించి వద్దామనుకున్నారా? అలా అయితే అర్ధరాత్రే తిరుగు ప్రయాణం ఎందుకయ్యారన్నది నివృత్తి కావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థి ముర్తుజా కారు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందా లేక నిద్రమత్తు కారణమై ఉంటుందా అనే విషయంపైనా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై నిట్ విద్యార్థి వ్యవహారాల డీన్‌ శ్రీనివాసాచారిని వివరణ కోరగా, విద్యార్థులు తమ అనుమతి తీసుకోకుండా బయటకు వెళ్లారని చెప్పారు. క్యాంపస్‌లో రాత్రి 11 తర్వాత విద్యార్థులు బయటకు వెళితే సరైన కారణాలు చెప్పాలని.. ఈ ఆరుగురు అంతకన్నా ముందే బయటకు వెళ్లినట్టు అనుమానిస్తున్నామన్నారు. వారు కోలుకున్నాక అడిగి స్పష్టత ఇస్తామని చెప్పారు. క్యాంపస్‌లో ఇక నుంచి మరింత కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

ఆశలు ఆవిరై.. అందనంత దూరమై

తాడెపల్లి నిస్సి (పాతచిత్రం)

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు. కంటికి రెప్పలా చూసుకున్నారు. ఉన్నత విద్యా సంస్థలో సీటొచ్చిందని మురిసిపోయారు. తమ గారాలపట్టిని గొప్ప ఇంజినీర్‌గా చూడాలని కోటి ఆశలతో ఏలూరు నుంచి ఓరుగల్లుకు పంపారు ఆ తల్లిదండ్రులు. అంతలోనే ఆశలు ఆవిరయ్యాయి. రహదారి ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు తమ కూతురిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. రహదారి ప్రమాదంలో మృతి చెందిన నిస్సి తల్లిదండ్రుల  బాధను తీర్చేదెవరు?

  •  నిస్సి తండ్రి ప్రసాద్‌ దర్మాజిగూడెంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. తల్లి అరుణ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ప్రణీత్‌ బీటెక్‌ చదువుతున్నారు. కూతురు నిస్సికి గతేడాది వరంగల్‌ నిట్లో సివిల్‌ ఇంజినీరింగ్‌లో సీటు రావడంతో ప్రఖ్యాత సంస్థలో తమ కూతురు మంచి చదువు చదువుతోందని ఎంతో మురిసిపోయారు. ఇద్దరు పిల్లల్ని ఇంజినీర్లను చేయాలనుకుని కలలు కన్నారు. ఇంతలోనే కూతురు ఇలా దుర్మరణం చెందడంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గురువారం ములుగు జిల్లా ఆసుపత్రి వద్ద తల్లి అరుణ కూతురు మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ రోదించడంతో స్నేహితురాలిని కడసారి చూసి వెళదామని వచ్చిన స్నేహితులందరూ కంట తడి పెట్టారు. తండ్రి ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ములుగు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం నిస్సి మృతదేహానికి ములుగు జిల్లా ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు వారు తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు.

ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో రోదిస్తున్న మృతురాలి తల్లి తాడేపల్లి అరుణ, పక్కన తండ్రి ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని