logo

ఓరుగల్లుకు జ్వరం

ఎవర్ని కదిలించినా నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు, జ్వరాలంటున్నారు.. ఆసుపత్రులకు బాధితులు వరుస కడుతున్నారు.

Updated : 23 Sep 2023 08:35 IST

కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో..

న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి: ఎవర్ని కదిలించినా నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు, జ్వరాలంటున్నారు.. ఆసుపత్రులకు బాధితులు వరుస కడుతున్నారు. వర్షాలకు తోడు పరిసరాల పరిశుభ్రత లేమి కారణంగా పెరిగిన దోమలు వ్యాధులకు కారణమవుతున్నాయి. జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాలతోపాటు, ఎంజీఎం ఆసుపత్రికి వైద చికిత్సలకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సగటున రోజుకు 70 మందికి పైగా జ్వరాలతో వస్తుండగా, ఎంజీఎం ఆసుపత్రికి ప్రతి రోజూ వచ్చే 3 వేలకుపైగా ఓపీల్లో 600కు పైగా జ్వరాలతో ఉంటున్నారు. ఓపీ ల్యాబులో ప్రతి రోజు 70 మందికి పైగా నమూనాలు సేకరించి పంపిస్తుండగా అందులో 7 నుంచి 10 వరకు డెంగీ పాజిటివ్‌ నివేదికలు వస్తున్నట్లు ఎంజీఎం అధికారులు తెలిపారు. ఇక ఆసుపత్రిలో చేరి జ్వరంతో చికిత్స పొందుతున్న వారి నుంచి ప్రతి రోజు 50 మంది రోగుల శాంపిల్స్‌  సేకరిస్తే  కనీసం ఏడుగురికి డెంగీ పాజిటివ్‌ నివేదికలు వస్తున్నాయని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో 200పైగా జ్వర బాధితులు ఉన్నారు.

నగరంలో 72 డెంగీ కేసులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ నగరంలో డెంగీ పంజా విసురుతోంది. ఇప్పటివరకు 72 డెంగీ, 5 మలేరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో 15-20 మంది పిల్లలు ఉన్నారు. వైరల్‌ జ్వరాలు ఇంటింటా ఉన్నాయి. ఆరెపల్లి, హసన్‌పర్తి, భీమారం, గోపాల్‌పూర్‌, కడిపికొండ రాజీవ్‌ గృహకల్ప, తిమ్మాపూర్‌, మామునూరు, బొల్లికుంట, గొర్రెకుంట తదితర విలీన గ్రామాలు, వరంగల్‌ ప్రాంతంలో దేశాయిపేట, కాశీబుగ్గ, చింతల్‌, ఖిలావరంగల్‌, రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్‌, ఎన్టీఆర్‌నగర్‌, రామన్నపేట తదితర ప్రాంతాల్లో డెంగీ, మలేరియా కేసులు వెలుగు చూశాయి.


బల్దియా అప్రమత్తం

  నగరంలో డెంగీ, మలేరియా కేసులు పెరగడంతో బల్దియా అర్బన్‌ మలేరియా విభాగం అప్రమత్తమైంది. డెంగీ పాజిటివ్‌ కేసు నమోదైన ఇంటి వదంద దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నారు. కాలనీల్లో దోమల నివారణ చర్యలు చేపడుతున్నారు. యాంటీ లార్వాలో భాగంగా ఖాళీ స్థలాల్లో ఆయిల్‌ బాల్స్‌ విసురుతున్నారు. ఎంఎల్వో ఆయిల్‌ చల్లుతున్నారు. సాయంత్రం వేళ ఫాగింగ్‌ చేస్తున్నారు.


  జాగ్రత్తలు పాటించాలి
-డాక్టర్‌ మధుసూదన్‌, జిల్లా కీటక జనిత వ్యాధుల నివారణ అధికారి, వరంగల్‌  

ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీరు నాలుగైదు రోజులు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయని గుర్తించాలి. మురుగు కాలువల్లో నీరు ఎప్పుడూ పారే విధంగా చూడాలి. నిల్వ ఉన్న నీటిలో కిరోసిన్‌ లేదా వాడిన డీజిల్‌ ఆయిల్‌ చల్లాలి. ఇంట్లో ఇంటి చుట్టూ పనికిరాని పాత కూలర్లు, టైర్లు, డ్రమ్ములు, రోళ్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన కుండలు, సీసాలు లేకుండా చూసుకోవాలి. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులపై మూతలు ఉంచాలి. దోమలు కుట్టకుండా కిటికీలకు బయట తలుపులకు దోమలు రాకుండా మెష్‌లు ఏర్పాటు చేసుకోవాలి. వ్యక్తిగత రక్షణకు దోమతెరలు, కాయిల్స్‌ వాడాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నిద్రించేటప్పుడు దోమ తెరలు ఉపయోగించాలి.  


జ్వరమనిపిస్తే పరీక్షలు తప్పనిసరి
డాక్టర్‌ సమ్మయ్య, జనరల్‌ మెడిసిన్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, ఎంజీఎం ఆసుపత్రి

ఐదు రోజులైనా జ్వరం తగ్గడం లేదనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని సంప్రదించాలి. డెంగీ లక్షణాలున్న వారు సామాజిక ఆరోగ్య కేంద్రం, ఎంజీఎం ఆసుపత్రిలో డెంగీ నిర్ధారణ పరీక్ష(ఎలీసా), మలేరియా పరీక్ష చేయించుకోవాలి. లక్షణాల ఆధారంగా రక్త నమూనాలు పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తారు. పోషకాహారం తీసుకున్నట్లయితే ఆరోగ్యం మెరుగవుతుంది.


ఒక రోజుకే రూ.10 వేలు ఖర్చు

ప్రస్తుతం వరంగల్‌ ఎంజీఎంలో డెంగీ చికిత్స పొందుతున్న ఈ బాలుడు ఇస్లావత్‌ గణేశ్‌. నల్లబెల్లి మండలం గోవిందాపురం శివారు లైన్‌తండ నివాసి. నర్సంపేటలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆరు రోజుల క్రితం డెంగీ వ్యాధి సోకడంతో వార్డెన్‌ తల్లికి సమాచారం ఇవ్వగానే వచ్చి బాలుడిని మొదట ప్రైవేటు వైద్యుడి వద్ద చూపించింది. మందులు వాడినా తగ్గక పోవడంతో మరుసటి రోజు నర్సంపేటలోని ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో చేర్పిస్తే ఒక రోజుకు రూ.10 వేలు ఖర్చు అయింది వైద్య పరీక్షల్లో డెంగీ పాజిటివ్‌ వచ్చిందని నయం కావాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఆరు రోజుల కిందట ఎంజీఎంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రక్త కణాల సంఖ్య పెరగడం లేదని డాక్టర్లు అంటున్నారని తల్లి కన్నీటిపర్యంతమైంది.
న్యూస్‌టుడే, నర్సంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని