logo

కబ్జాదారులపై పోలీసుల ఉక్కు పాదం

వరంగల్‌ మహానగరం స్మార్ట్‌ సిటీగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో భూములకు రెక్కలు వచ్చాయి.

Published : 24 Sep 2023 04:49 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌ మహానగరం స్మార్ట్‌ సిటీగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో భూములకు రెక్కలు వచ్చాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు  భూకబ్జాదారులు వాలిపోతున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకోవడం, అవసరమైతే నకిలీ పత్రాలు సృష్టించి భూవివాదాలకు తెరతీస్తున్నారు. నిజమైన యజమానులను భయపెడుతూ తమ పనికానిచ్చేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో నగరంలో చాలా వెలుగు చూశాయి. భూ సమస్యలపై వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌కు సుమారు 4 వేల ఫిర్యాదులు అందాయి. ప్రాధాన్యత క్రమంలో సీపీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు పరిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,800 దరఖాస్తులను పరిష్కరించడం విశేషం.
ప్రత్యేక చొరవ : సామాన్యులు పైసాపైసా కూడబెట్టుకొని భూమిని కొనుగోలు చేసి, ఆపై కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటి నిర్మాణం చేసుకునే సమయంలో ఆక్రమణదారులు రంగ ప్రవేశం చేస్తున్నారు. గతంలో ఠాణాలో ఫిర్యాదు చేస్తే సివిల్‌ వివాదమని ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ సీపీగా రంగనాథ్‌ వచ్చాక భూకబ్జాలపై ఉక్కుపాదం మోపారు. ప్రామాణిక కార్యాచరణ విధానం(ఎస్‌వోపీ) అవలంభిస్తూ విచారణ చేపడుతున్నారు. సమస్యలు పరిష్కారమవుతుండటంతో పోలీసు గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదుదారుల సంఖ్య పెరిగింది. సీపీ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. భూకబ్జాలకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో విచారణ: వివాదాలను పరిష్కరించే సమయంలో ఇరు వర్గాలకు చెందిన పత్రాలను పరిశీలిస్తున్నారు. అవసరాన్నిబట్టి భూమి ఉన్న ప్రదేశాన్ని ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీసీపీ స్థాయి అధికారి వరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. భూమి కొనుగోలు ఒప్పంద సమయం నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు ఇరు వర్గాలు జరిపిన బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసిన మొత్తానికి, భూమి విలువను పరిశీలిస్తున్నారు. తేడాలుంటే మరింత లోతుగా విచారిస్తున్నారు.  పత్రాలు, సర్వే నెంబర్లు, ప్రస్తుతం కబ్జాలో ఎవరు ఉన్నారు..? ఎంతకాలం నుంచి వీరు ఉంటున్నారు...తదితర విషయాలపై దర్యాప్తు చేసి సీపీకి నివేదిక ఇస్తున్నారు. పత్రాలపై ఏదైనా అనుమానం వస్తే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. భూమి హక్కు పత్రాలు ఎవరికి సరిగ్గా ఉంటే వారికి పోలీసులు న్యాయం చేస్తున్నారు.  కమిషనరేట్‌ పరిధిలో 48 మంది పదే పదే భూకబ్జాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇందులో కొందరిపై రౌడీషీట్‌ తెరిచారు. నలుగురిపై పీడీ యాక్టు అమలు చేశారు. వీరికి ఎవరు సహకరించారనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల నమోదైన కేసుల వివరాలు

  •  హనుమకొండ ఠాణా పరిధిలోని కాకతీయకాలనీలో భూవివాదంలో జోక్యం చేసుకొని ఆ స్థలాన్ని విక్రయించాలని ఎదుటి వ్యక్తిపై ఒత్తిడి తెచ్చిన ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
  •  మడికొండలో జోక్యం చేసుకున్న ప్రజాప్రతినిధితో పాటు కొంత మందిపై  కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 
  • కేయూ ఠాణా పరిధిలోని భూములకు నకిలీ పత్రాలు సృష్టించి క్రయవిక్రయాలు జరిపిన ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ పత్రాలు, కంప్యూటర్‌, ప్రింటర్‌ తదితర సామగ్రిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చట్టం పరిధిలో పరిష్కారం - ఏవీ రంగనాథ్‌, సీపీ

భూవివాదాలను చట్టం పరిధిలో పరిష్కరిస్తున్నాం. ఎస్‌వోపీ అనుసరిస్తూ ముందుకెళ్తున్నాం. ఇరువర్గాల పత్రాలు, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజమైన యజమానికి న్యాయం చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని