logo

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అయిదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 24 Sep 2023 04:49 IST

వివరాలు వెల్లడిస్తున్న జయశంకర్‌ జిల్లా ఎస్పీ కరుణాకర్‌

భూపాలపల్లి క్రైం, న్యూస్‌టుడే : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అయిదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, మావోల సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శనివారం రాత్రి ఎస్పీ పుల్లా కరుణాకర్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలోని మహాముత్తారం మండలం యామన్‌పల్లి వద్ద ఎస్సై సుధాకర్‌ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అయిదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకొని విచారించగా మావోల సానుభూతిపరులుగా నిర్ధారణ అయింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రానాపూర్‌కు చెందిన దురిశెట్టి సాయిలు, కొత్తపల్లికి చెందిన మెరుగు స్వామి, రామారావుపల్లికి చెందిన నిమ్మరాజుల శంకర్‌, బామ్లానాయక్‌ తండాకు చెందిన ముడు శివకుమార్‌, కమాన్‌పూర్‌ మండలం రేపల్లెవాడకు చెందిన బొమ్మన కుమార్‌గా గుర్తించారు. దురిశెట్టి సాయిలు గతంలో 1988 నుంచి 1996 వరకు పీబ్ల్యూజీ దేవన్న దళంలో పనిచేసి లొంగిపోయారు. మళ్లీ మావోలకు సహకరించాలని జేఎంఎండబ్ల్యూపీ డివిజన్‌ ఏటూరునాగారం-మహదేవ్‌పూర్‌ ఏరియా కమిటీ సంయుక్త కార్యదర్శి ఈగోల్లపు మల్లయ్యను కలిసి మావోయిస్టు నేత దామోదర్‌ దగ్గరికి వెళ్లారు. పార్టీ కోసం పని చేస్తానని, క్యాడర్‌ను తయారు చేస్తానని చెప్పి వచ్చారు. ఇందులో భాగంగా గతంలో మావోయిస్టులకు సహకరించిన సానుభూతిపరులు, భావజాలం గల నలుగురు వ్యక్తులను సంప్రదించాడు. వారితో ఈ నెల 20న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని భీమారం వెళ్లి మల్లయ్యను కలిశారు. వారికి మావో సాహిత్య గ్రంథాలు, కరపత్రాలు, జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు ఇవ్వడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ద్విచక్ర వాహనాలపై వస్తున్న క్రమంలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో యామన్‌పల్లి వద్ద వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి ఐదు చరవాణులు, మూడు ద్విచక్ర వాహనాలు, మావో సాహిత్య గ్రంథాలు, కరపత్రాలు, 3 జిలెటిన్‌ స్టిక్స్‌, 3 డిటోనేటర్లు, రూ.21,630 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, కాటారం సీఐ రంజిత్‌కుమార్‌, మహాముత్తారం ఎస్సై సుధాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని