logo

ఆరాటమే.. పోరాటమేది?

సింగరేణి కార్మిక సంఘాలు తమ ఉనికి కోసం ఆరాటపడుతున్నాయి. కార్మికుల సమస్యలను నోటిమాటగా ప్రస్తావిస్తున్నాయి.

Updated : 24 Sep 2023 05:02 IST

న్యూస్‌టుడే, కోల్‌బెల్ట్‌: సింగరేణి కార్మిక సంఘాలు తమ ఉనికి కోసం ఆరాటపడుతున్నాయి. కార్మికుల సమస్యలను నోటిమాటగా ప్రస్తావిస్తున్నాయి. పైపై మాటలతో పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. కనీసం ఒప్పందం జరిగిన అంశాలను కూడా అమలు చేయించలేకపోతున్న సంఘాల తీరుతో కార్మికుల్లో చులకన భావన కలుగుతోంది. జేబీసీసీఐ పరిధిలో అన్ని హక్కులు, ప్రయోజనాలు అమలవుతున్నా సింగరేణిలో మాత్రం కొన్నింటిని వర్తింపజేయడం లేదు. దీనిపై నిలదీసి అమలు చేయించాల్సిన సంఘాల ఉదాసీనత కార్మికుల్లో అసంతృప్తి కలిగిస్తోంది.

గ్రాట్యుటీపై రాని స్పష్టత

గ్రాట్యుటీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో సమయం నుంచి అమలు కావాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రూ.10 లక్షలు ఉన్న గ్రాట్యుటీని రూ.20 లక్షలకు పెంచారు. దీన్ని 2017 ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారు. కార్మికులకు 2016 జనవరి నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో జేబీసీసీఐ స్టాండరైజేషన్‌ కమిటీ సమావేశంలో ఆమోదం లభించింది. కానీ, అమలు చేయించేందుకు నాయకత్వం పట్టుపట్టడం లేదు. 2016 జనవరిలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.20 లక్షలు వర్తింపజేయాలి.. ఏడాది కాలం నష్టపోతుండటంతో సుమారు 3000 మంది విశ్రాంత ఉద్యోగులకు రూ.20 లక్షల గ్రాట్యుటీ వర్తించకుండా పోయింది. దీనిపై సరైన కార్యాచరణ.. యాజమాన్యాలపై ఒత్తిడి తేవాల్సిన సంఘాలు మొక్కుబడి తీరుతో అమలుకు నోచుకోవడం లేదు.

24 ఏళ్లుగా ఒకేరకమైన పింఛను

బొగ్గు గని కార్మికుల పింఛను 24 ఏళ్లుగా ఎలాంటి సవరణ లేకుండా ఒకేలా అమలవుతోంది. 1998లో పింఛను పథకం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి మూడేళ్లకోసారి సవరించుకోవాలన్న అంగీకారం ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా పింఛను సవరించలేదు. దీంతో చాలా మంది విశ్రాంత కార్మికులకు కేవలం రూ.300 పింఛను వస్తోంది. దీనిపై విశ్రాంత కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సీఎంపీఎఫ్‌ ట్రస్టు బోర్డులో నిలదీసి పింఛను పథకం సవరించేందుకు కార్మిక సంఘాలు పట్టుబట్టడం లేదు.

ప్రయోజనాలపై పన్ను భారం  

కార్మికులకు చెల్లించే వివిధ ప్రయోజనాలపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కోల్‌ఇండియాలో 2013 జనవరి 1 నుంచి అమలవుతోంది. సింగరేణిలో స్థానికంగా అమలు చేయించుకోవాల్సిన కార్మిక సంఘాలు కేవలం మాటలతోనే సరిపెడుతున్నాయి. గుర్తింపు సంఘం యాజమాన్యంతో చర్చించి అమలు చేయించలేకపోయింది. ఒక్కో కార్మికునికి రూ.25 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయపు పన్ను భారం పడుతోంది. దీన్ని అమలు చేయించాల్సిన కార్మిక సంఘాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.

  దీర్ఘకాలిక సమస్యలివీ..

సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. సొంతింటి కల నెరవేరడం లేదు. ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలన్న డిమాండ్‌ అమలుకు నోచుకోవడం లేదు. గనులపై అధికారుల వేధింపులు, పని స్థలాల్లో రక్షణ చర్యలపై నిర్లక్ష్యం.. కనీసం పరికరాలు కూడా సక్రమంగా సరఫరా చేయని తీరు.. బినామీ పేర్ల మార్పు చేయాలన్న ఒప్పందాన్ని అమలు చేయించలేని నిస్సహాయ స్థితి.. అనేక సమస్యలు కార్మికులను చుట్టిముట్టి వేధిస్తున్నా పరిష్కారానికి చిత్తశుద్ధితో చొరవ చూపని సంఘాలు పట్టు కోసం మాత్రం కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని