logo

పల్లె తోవ.. స్వచ్ఛతా హీ సేవ!

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను నిజం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.

Published : 24 Sep 2023 04:49 IST

పారిశుద్ధ్య పనులు చేపడుతున్న పంచాయతీ కార్మికులు

న్యూస్‌టుడే, చెల్పూర్‌(భూపాలపల్లి రూరల్‌): దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను నిజం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు నిర్మించి పల్లెలు పారిశుద్ధ్యంలో మెరిసేలా చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ పథకాన్ని అమలు చేస్తూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. తాజాగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ద్వారా 18 రోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జిల్లాలోని 241 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన కార్యక్రమం అక్టోబర్‌ 2 గాంధీ జయంతి వరకు 18 రోజుల పాటు నిర్వహించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే రోజుకో కార్యక్రమం చొప్పున 18 రోజుల పాటు పారిశుద్ధ్య పనులు, అవగాహన కార్యక్రమాలు తదితర వాటిని నిర్వహించనున్నారు.  

వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 18 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యంగా వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించేలా ప్రణాళిక తయారు చేశారు. 18 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, తదితర వాటిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చెత్తాచెదారంతో పేరుకుపోయిన మురుగు కాల్వలను శుభ్రం చేయించడం, తడి, పొడి చెత్తను వేరుగా చేసి సేంద్రియ ఎరువుగా తయారు చేయడం, ప్లాస్టిక్‌ అనర్థాలపై అవగాహన కల్పించి వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవడం, శ్రమదానం, మొక్కల సంరక్షణ, పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, ప్రాముఖ్యతపై విద్యార్థులకు క్విజ్‌, ప్లాంటేషన్‌ డ్రైవ్‌, స్వచ్ఛ ప్రార్థన, స్వచ్ఛతా రన్‌ నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు.


ప్రణాళిక ప్రకారం అమలు
- వెంకటేశ్వర్లు, జిల్లా అదనపు కలెక్టర్‌

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థంగా నిర్వహించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా 18 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించేలా ఆదేశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని