logo

‘జనగామ టికెట్‌పై రెండు రోజుల్లో ప్రకటన’

జనగామ నియోజకవర్గానికి చెందిన పలువురు భారాస ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీ  నాయకులను శనివారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌కు పిలిపించుకొని సమావేశమయ్యారు.

Published : 24 Sep 2023 04:49 IST

హైదరాబాద్‌లో నేతలతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ నియోజకవర్గానికి చెందిన పలువురు భారాస ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీ  నాయకులను శనివారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌కు పిలిపించుకొని సమావేశమయ్యారు. ఎన్నికల కంటే ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి చేర్యాలను రెవెన్యూ డివిజన్‌ చేయిస్తానని, బచ్చన్నపేటకు వ్యవసాయ మార్కెట్‌ను మంజూరు చేయిస్తానని పల్లా పేర్కొన్నారు. జనగామలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు తీసుకొస్తానన్నారు. జనగామ టికెట్‌ను తనకు కేటాయిస్తూ రెండు రోజుల్లో ప్రకటించబోతున్నట్లు ఆయన భారాస నాయకులకు తెలిపారు. టికెట్‌ ప్రకటన రాగానే కొమురవెల్లి దేవస్థానం నుంచి జనగామ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారని, సుమారు 20వేల మందితో జనగామ ఆర్టీసీ చౌరస్తాలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్లా వర్గీయులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది  

జనగామ సీటు విషయంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఆయన మాట్లాడుతూ తాను శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశానన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పని చేసుకొమ్మని సూచించారన్నారు. తన గురించి కేసీఆర్‌కు తెలుసని, ఆయన తనకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.   తాను ఎలాంటి కార్పొరేషన్‌ పదవి తీసుకుంటానని కేసీఆర్‌తో చెప్పలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని