logo

నిమజ్జన వేడుకలు.. కారాదు విషాదాంతం

స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలో గతేడాది నెలకొల్పిన వినాయక మండపంలో అపశ్రుతి చోటు చేసుకుంది.

Updated : 24 Sep 2023 05:04 IST

నెల్లుట్ల చెరువులో విగ్రహాల నిమజ్జనం (పాత చిత్రం)

‘స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలో గతేడాది నెలకొల్పిన వినాయక మండపంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వర్షం కురుసున్న సమయంలో పుంజూరి శివ అనే యువకుడు గణపతి మండపం వద్ద ఇనుప స్టాండ్‌ వేసుకొని విద్యుత్తు బల్బు అమర్చుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు’

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఏటా వాడ వాడలా గణపతి మండపాలను ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా గణనాథులకు ఘనంగా పూజలు చేస్తారు. అనంతరం లంబోదరుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులు, కుంటలు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. చిన్నా, పెద్దా, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ వేడుకల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా జిల్లా కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మండపాలను ఏర్పాటు చేసి ఏకదంతుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. గణేష్‌ మండపాల నుంచి విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనోత్సవం వరకు జరిగే ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలను నివారించవచ్చని పోలీస్‌, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సూచిస్తున్నారు.


ప్రమాదాలు ఇలా..

నవరాత్రి ఉత్సవాల్లో ఏటా ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. గణేశ్‌ మండపాలకు విద్యుత్తు కనెక్షన్‌ తీసుకునేటప్పుడు, అలంకరణ దీపాలను అమర్చే సమయంలో విద్యుదాఘాతంతో మృత్యువాత పడుతున్నారు. అస్తవ్యస్తంగా వేలాడే తీగలతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. విగ్రహాల నిమజ్జనానికి నిర్వహించే ఊరేగింపులోనూ అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్రతిష్ఠించిన భారీ గణపతి విగ్రహాలను వాహనాలపై తీసుకెళ్లే క్రమంలో పైన ఉండే విద్యుత్తు తీగలను తాకడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలపై ఉన్న వారు  ప్రమాదవశాత్తూ వాహనాల చక్రాల కింద పడి మరణించిన సంఘటనలు ఉన్నాయి. విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసే సమయంలో చెరువుల వద్ద లోతును అంచనా వేయకుండా యువకులు లోపలికి వెళ్లి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఈత వచ్చిన వారు కూడా మృత్యువాత పడుతున్నారు. ఉత్సవాల నిర్వాహకులు, భక్తులు నిమజ్జన వేడుకలో అధికారుల సూచనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.


నిమజ్జన ఏర్పాట్లపై దృష్టి

జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 26, 27 తేదీల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మండపాల వద్ద విద్యుత్తు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే విద్యుత్తు శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వాహకులకు సూచనలు అందించారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద రక్షణ కంచెలు, తాళ్లను అమర్చుతున్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ విగ్రహాలను నీటిలోకి తీసుకెళ్లేందుకు క్రేన్‌లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనం జరిగే రోజు ఊరేగింపులతో పాటు చెరువుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించిన విగ్రహాలను జనగామ శివారులోని నెల్లుట్ల చెరువులో నిమజ్జనం చేయనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లోని మండలాల్లోనూ పోలీస్‌, రెవెన్యూశాఖల  ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.


పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం

- పి.సీతారాం, వెస్ట్‌జోన్‌ డీసీపీ

జిల్లాలో ఈ నెల 26, 27 తేదీల్లో గణపతి విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తాం. చెరువుల వద్ద బారీ కేడ్లు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి నిర్వాహకులకు సూచనలు అందించాం. ఈ నెల 28న మిలాద్‌-ఉన్‌నబీ పర్వదినం ఉండగా అక్టోబర్‌ 1న నిర్వహించుకునేలా ముస్లిం సోదరులకు సూచించాం. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోగా నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని