logo
Published : 29/11/2021 02:18 IST

ఎంత ఆయకట్టుకు ఇస్తారో?

నేడు సాగునీటి సలహా మండలి సమావేశం

నిడదవోలు, న్యూస్‌టుడే: ఉభయగోదావరి జిల్లాల పరిధిలో రబీలో 74.41 శాతం ఆయకట్టుకు సాగునీరు అందించే దిశగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సోమవారం ఏలూరులో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది గోదావరిలో సాగునీటి లభ్యత పూర్తి స్థాయిలో లేనందున ప్రస్తుత లెక్కల ప్రకారం ఎంత ఆయకట్టుకు నీరివ్వాలనే విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం ఉభయగోదావరి జిల్లాల పరిధిలో 8,95,533 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో పశ్చిమగోదావరిలో 4.60 లక్షల ఎకరాలు ఉంది. రబీ సీజన్‌లో సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం మొత్తం 90.22 టీఎంసీలు అవసరమని గుర్తించారు. అయితే 61.762 టీఎంసీలే అందుబాటులో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. 74.41 శాతం ఆయకట్టుకు మాత్రమే నీరందించే వీలుంటుందని అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రకారం తూర్పు గోదావరిలో 3,24,824 ఎకరాలకు, పశ్చిమ గోదావరిలో 3,42,288 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ దృష్ట్యా డిసెంబరు 31 నాటికి నాట్లు వేసిన ఆయకట్టుకు మాత్రమే నీరందించేలా చర్యలు తీసుకోనున్నారు. తొంభై రోజుల వ్యవధి కలిగిన పంటలనే అనుమతించడం ద్వారా నీటి ఎద్దడిని అధిగమించవచ్చనేది జలవనరుల శాఖ అధికారుల అంచనా.

సీలేరు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కులు... రబీ సీజన్‌లో రోజూ సుమారు 9 వేల క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో జనవరి నుంచి మార్చి వరకు సీలేరు ప్రాజెక్టు నుంచి నిత్యం 4 వేల క్యూసెక్కుల చొప్పున గోదావరికి నీటని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ జెన్‌కో అధికారులను కోరనున్నారు. ఒడిశాలోని బలిమెల ప్రాజెక్టులో ఏపీ రాష్ట్ర భవిష్యత్తు నీటి వాటాను ముందుగా వాడుకునేందుకు ఆ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మురుగు కాలువలకు అడ్డుకట్ట వేసి ఆయిల్‌ ఇంజిన్లు, విద్యుత్తు మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. గోదావరి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంటుంది.

చివరిలో తప్పని కష్టాలు... ప్రస్తుతం గోదావరి నుంచి నేటికీ అదనపు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. రబీ చివరిలో మాత్రం సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వంతుల వారీ విధానం అమలు చేయాల్సి వస్తోంది. ఆ సమయంలో వరి పంట పొట్ట దశలో ఉండి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. డిసెంబరు ఒకటి నుంచి రబీ సీజన్‌ ప్రారంభం అవుతుంది. నెలాఖరుకు నాట్లు పూర్తి చేస్తే.. మార్చి 31నే కాలువలకు నీటి విడుదలను నిలుపుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతోపాటు కాలువలు మూసి వేసిన తర్వాత చేపట్టాల్సిన పనులపైనా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఎత్తిపోతల పథకాల కింద... గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున కుమారదేవం, వేగేశ్వరపురం, పైడిమెట్ట, గూటాల, పోలవరం, ఎర్రకాలువ తదితర ఎత్తిపోతల పథకాలకు నీరు ఇచ్చే అంశం సందిగ్ధంలో ఉంది. దీనిపైనా సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో సాగునీటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుకు నీరు ఇచ్చిన సందర్భాలు లేవు.

రబీకి కావాల్సింది 90.22 టీఎంసీలు

అందుబాటులో 61.762 టీఎంసీలు

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని