logo
Published : 29/11/2021 02:18 IST

నీడ లేక..నిలువ లేక..

ప్రయాణికులకు అవస్థలు

పట్టించుకోని అధికారులు

జిల్లా కేంద్రం ఏలూరులోని ఫైర్‌స్టేషన్‌ కూడలిలో ప్రయాణికులు చెట్ల కింద, దుకాణాల ఆవరణల్లో వేచి ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు, లంక గ్రామాల నుంచి వచ్చేవారు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ఎండ, వానల్లో నిల్చోవాల్సి వస్తోంది. జిల్లాలోని మిగతా పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

న్యూస్‌టుడే బృందం

జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులకు నిలువ నీడ లేని పరిస్థితి నెలకొంది. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక బస్టాప్‌ ఉంది. చాలాచోట్ల షెల్టర్లు లేనందున ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిలబడి నిరీక్షించాల్సి వస్తోంది. నిత్యం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆయా పనుల నిమిత్తం సమీప మండల కేంద్రాలు, పట్టణాలకు వచ్చే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. బస్సులు సమయానికి రాకపోవడం, వచ్చే వాటిల్లో ఖాళీలు ఉండకపోవడంతో వేచి ఉండాల్సి సమయమూ పెరుగుతోంది. అంతసేపు వేచి ఉండలేక ఆటోల్ని ఆశ్రయిస్తే రెట్టింపు ఛార్జీలు చెల్లించక తప్పదు. బస్సు షెల్టర్లు ఉన్నచోట్ల వాటి నిర్వహణ సరిగా లేనందున వాటిల్లో కాలు పెట్టాలంటే భయపడాల్సి వస్తోంది. మరోవైపు షెల్టర్లు ఉన్నచోట బస్సులు నిలవకపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో చాలావరకు దాతలు, స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో నిర్మించినవి ఉన్నాయి. వాటికి మరమ్మతులు, రంగులు వేయిస్తే ఉపయోగపడతాయి.

నిత్యం రోడ్డుపైనే.. ‘ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళ్లాలంటే బస్సులు సమయానికి రానందున చాలా ముందుగా బస్టాప్‌నకు రావాల్సి వస్తోంది. షెల్టర్‌ లేనందున రోడ్డుపైనే వేచి చూడాల్సి వస్తోంది’ అని ఖండవల్లి విద్యార్థి ఎస్‌.శివ అన్నారు.

వేచి ఉండేదెలా?.. ‘కళాశాలలున్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల బస్టాప్‌లు లేవు. బస్సులు వచ్చేవరకు రహదారుల పక్కన, దుకాణాల ఎదుట ఉండటం ఇబ్బందిగా ఉంటోంది. వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేయాలి’ అని విద్యార్థిని టి.నాగపూజిత తెలిపారు.

నిత్య వేదన.. ‘పనులు ముగించుకుని భీమవరం వైపు వెళ్లే వాహనాల కోసం ఎదురు చూడాలంటే లాకుల ప్రాంతంలో షెల్టర్‌ లేదు. పైగా రద్దీ ఎక్కువ. ప్రయాణికులకు నిత్యం ఇక్కట్లే. వారి వెతలు పట్టించుకున్న నాథుడు లేరు. లాకుల ప్రాంతంలో షెల్టర్‌ ఉంటే బాగుంటుంది’ అని పాలకొల్లు మండలం దగ్గులూరుకు చెందిన గుడిమెట్ల సాయికృష్ణ వివరించారు.

తణుకులో..

వసతులు సమకూరుస్తాం.. ఏలూరు- జంగారెడ్డిగూడెం మార్గంలో 7వ మైలురాయి పరిధిలోని బస్టాప్‌ను తొలగించారు. అక్కడి ప్రయాణికుల దరఖాస్తుతో కొత్తగా ఏర్పాటుచేయనున్నాం. ఎక్కడైనా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులొస్తే వసతులు సమకూరుస్తాం. - ఎ.వీరయ్యచౌదరి, ఆర్టీసీ ఆర్‌ఎం

జిల్లా వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐలాండ్‌ భీమవరం, ఏలూరు, తణుకు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ముఖ్యకూడలి. ఎక్స్‌ప్రెస్‌ బస్సులన్నీ ఇటుగానే వెళ్తుంటాయి. మార్కెట్‌ పనులపై వచ్చేవారు, దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ నిలువ నీడ లేదు.

జిల్లాలో ఆర్టీసీ డిపోలు: 8

బస్సుల సంఖ్య: 625 (ఆర్టీసీ 500, అద్దె 165)

నిత్యం తిరిగే సర్వీసులు: 575

రూట్ల సంఖ్య: 176

రోజుకు ఆదాయం: రూ.63.50 లక్షలు

బస్సు స్టేషన్లు: 31

రోజుకు తిరిగే కిలో మీటర్లు: 2.22 లక్షలు

రోజుకు ప్రయాణికులు: 1.70 లక్షలు

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని