logo
Published : 29/11/2021 02:18 IST

పట్టకుంటే పండగప్ప!

తాజాగా పెరిగిన ధరలు

పాలకొల్లు, మొగల్తూరు, న్యూస్‌టుడే: కరోనా మొదటి దశలో విధించిన లాక్‌డౌన్‌తో పడిపోయిన పండుగప్ప ధరలు సుమారు ఏడాదిన్నర తరువాత పెరిగాయి. మొగల్తూరు, నరసాపురం, భీమవరం, ఆకివీడు, యలమంచిలి తదితర మండలాల్లో సుమారు 1800 ఎకరాల్లోని చెరువుల్లో పండుగప్ప సాగవుతోంది. వీటి సాగు కాలం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు. ఎకరంలో 500 నుంచి 1000 వరకు పిల్లలను వదులుతారు. జీవాహారం తీసుకునే వీటికి థిలాపియాలు(చైనాగొరక) అందిస్తారు. ఒక్కో చేప కిలో బరువు పెరిగేందుకు ఆరు కిలోల పైబడి మేత అందించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పోటీపడి మరీ.. ఈ ప్రాంతం నుంచి చెన్నై, హౌరా తదితర పట్టణాలకు పండుగప్ప చేపలను ఎగుమతి చేస్తారు. గతేడాది లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి నెల రోజుల కిందటి వరకు స్థానిక వ్యాపారులు కిలోకు రూ.300 నుంచి రూ.320 వరకు చెల్లించారు. అది కూడా పరిమితంగానే కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.400 నుంచి రూ.420 వరకు చెల్లిస్తున్నారు. పోటీపడి మరీ కొంటున్నారు. ఎప్పటికైనా ధర పెరగకపోతుందా.. అని ధైర్యం చేసి పట్టుబడి చేయని వారికి ప్రస్తుతం మేలు జరిగింది. కొన్ని నెలల వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

పిల్లలకు డిమాండ్‌.. పండుగప్ప చేపల ధర పెరగడంతో పలువురు రైతులు వీటి సాగుకు ముందుకొస్తున్నారు. దీంతో పిల్లలకు డిమాండ్‌ పెరిగింది. పావు కిలోకు అటుఇటు బరువు తూగే ఒక్కో దాన్ని రూ.120 నుంచి రూ.150 వరకు కొనుగోలు చేస్తున్నారు.

పెట్టుబడీ దక్కక.. సాధారణంగా రైతులు పండుగప్ప చేపలను మే, జూన్‌ నెలల్లో పట్టుబడి చేస్తారు. గతేడాది ఆ సమయానికి లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో ఎగుమతులు నిలిచిపోయాయి. అనంతరం ధర కూడా కిలో రూ.470 నుంచి రూ.300కు పడిపోయింది. రెండు నెలల కిందటి వరకు పెరుగుతుందని ఎదురు చూశారు. ఆ పరిస్థితి లేకపోవడంతో పలువురు పట్టుబడి చేశారు. పెట్టుబడి కూడా రాక అప్పులపాలయ్యారు. ప్రస్తుతం లాభాలు వస్తుండటంతో ఆనందంగా ఉన్నారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని