logo
Published : 29/11/2021 02:18 IST

ధాన్యం తరలించే దారేది ?

పుంత రోడ్ల అభివృద్ధి గాలికి..

గునుపూడిసౌత్‌ డ్రెయిన్‌ వెంబడి పుంత రోడ్డు ఇలా..

భీమవరం అర్బన్‌, పాలకోడేరు, న్యూస్‌టుడే : ఆంధ్రా అన్నపూర్ణగా పశ్చిమగోదావరి ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం వ్యవసాయం. ఎన్నో కష్టనష్టాలకు ఎదురొడ్డి రైతులు దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్నారు. అలాంటిది ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఇంటికి చేర్చడమూ ప్రస్తుతం కష్టతరంగా మారింది. సుమారు నాలుగేళ్లుగా పుంత రోడ్లను అభివృద్ధి చేయకపోవడంతో ధాన్యం రవాణాకు రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాలు కురుస్తు న్నందున ప్రస్తుతం ఎక్కడ చూసినా పుంత రోడ్లు బురద కయ్యలుగా తయారై నరకాన్ని చవిచూస్తున్నారు. సెమీడెల్టా, డెల్టాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ● భీమవరం పట్టణ పరిధి గునుపూడి బ్రిడ్జిపేట, గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌ వెంబడి ఉన్న కీలక పుంతరోడ్లు అధ్వానంగా మారాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సంగతి అటుంచితే కనీసం రైతులు నడిచేందుకూ దారి లేకుండాపోయింది. ఈ ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరి సాగవుతోంది.

గతమెంతో ఘనం.. పండించిన ధాన్యాన్ని పొలం నుంచి ప్రధాన రహదారి వరకు చేర్చడానికి పుంత మార్గాలే దిక్కు. సాగు సమయంలో విత్తు, నారు, ఎరువులు, పురుగు మందులు తరలించాలన్నా ఈ రోడ్లే ఆధారం. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఏటా రూ.కోట్లతో పుంత రోడ్లను అభివృద్ధి చేసేవి. ఒక ఏఎంసీ పరిధిలో వార్షికాదాయం రూ.కోటి వస్తే.. రూ.20 లక్షలు వీటి నిర్మాణానికి వెచ్చించేవారు. 2014 నుంచి 2017 వరకు 20 శాతం మార్కెటింగ్‌ శాఖ, 20 శాతం ఉపాధి హామీ పథకం నిధులతో చాలాచోట్ల అభివృద్ధి చేశారు. గత నాలుగేళ్లుగా పట్టించుకోవడం లేదు.

ప్రతిపాదనలు పంపాం.. పుంత రోడ్లను అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలోనే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాం. - మహేంద్రనాథ్‌, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ, ఏలూరు

పట్టించుకునే వారేరి?.. గతంలో రైతులకు సమస్య వచ్చిందంటే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం పట్టించుకునే వారు కనిపించడం లేదు. వ్యవసాయంలో కీలకమైన పుంత రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. - పి.గోపాలకృష్ణంరాజు, రైతు, యండగండి

ఏం చేయాలో తెలియడం లేదు.. నేను పదెకరాల్లో వరి సాగు చేశా. చాలా వరకు మాసూళ్లు పూర్తయ్యాయి. ధాన్యం ఆరబెట్టాలంటే వర్షం ఆటంకంగా ఉంది. ఎండ వచ్చినప్పుడు ఆరబెట్టి బయటకు తరలించడానికి పుంత రోడ్డు అధ్వానంగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. - నల్లం వెంకటేశ్వరరావు, రైతు, భీమవరం

గరగపర్రులో శ్మశానవాటికకు వెళ్లే పుంత రహదారి ఇది. సుమారు 200 ఎకరాల చేలకు ఇదే ప్రధాన మార్గం. దీనిని ఆనుకుని ఎస్సీ కాలనీ కూడా ఉండటంతో రైతులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గరగపర్రులో యనమదుర్రు డ్రెయిన్‌ గట్టు వెంబడి పుంత రోడ్డు ఇది. గరగపర్రు నుంచి మోగల్లు విద్యుత్తు ఉపకేంద్రానికి వెళ్లే ఈ మార్గంలో సుమారు 500 ఎకరాల సాగు భూమి ఉంది. రహదారి అధ్వానంగా మారడంతో రైతులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. చినుకుపడితే ఈ రహదారి మొత్తం బురదమయంగా మారుతుంది.

జిల్లాలో వివరాలు ఇలా..

వరి సాగు విస్తీర్ణం (ఖరీఫ్‌) 5.42 లక్షల ఎకరాలు

వాటి అభివృద్ధికి వెచ్చించిన వ్యయం రూ.100 కోట్లు

2014-17 మధ్య అభివృద్ధి చేసినవి 520 పుంత రోడ్లు

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని