logo

కదిలిన యంత్రాంగం..కానరాని పరిష్కారం !

కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో ఏర్పాటైన వైద్యశిబిరం నాలుగోరోజు కొనసాగింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కదిలింది. సోమవారం జేసీ హిమాన్షుశుక్లా డీఎంహెచ్‌వో భానూనాయక్‌, డీఈవో రేణుక,

Published : 07 Dec 2021 04:37 IST

బోడిగూడెంలో నాలుగోరోజూ 4 కేసులు


ఇంటింటా జ్వరసర్వే నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో ఏర్పాటైన వైద్యశిబిరం నాలుగోరోజు కొనసాగింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కదిలింది. సోమవారం జేసీ హిమాన్షుశుక్లా డీఎంహెచ్‌వో భానూనాయక్‌, డీఈవో రేణుక, డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌చ డీపీవో రమేష్‌ బాబు, ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డిప్యూటీడీఎంహెచ్‌వో మురళీకృష్ణ తదితరులు గ్రామంలో పర్యటించారు. స్థానిక జడ్పీ ఉన్నతపాఠశాలను పరిశీలించారు. జేసీ అధికారులతో సమీక్షించారు. కొయ్యలగూడెంలో ఆరోగ్య కేంద్రం, ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. మరోవైపు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన పనులు సాగుతున్నప్పటికీ జ్వరాల సమస్యకు పరిష్కారం తేల్చకపోవడంపై గ్రామస్థులు పెదవి విరుస్తున్నారు.

మరో నాలుగు జ్వరం కేసులు: శిబిరంలో సోమవారం మరో నాలుగు జ్వరం కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెప్పారు. వీరిలో ముగ్గురు బాలలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. వీరిలో విద్యార్థి చిడిపి సందీప్‌ కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స పొందుతుండగా అయిదేళ్ల సంసాని తేజస్వినిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. మరొక బాలికతోపాటు రెండు రోజులుగా నమోదైన మరికొందరు జ్వరపీడితులు స్వల్ప లక్షణాలతో ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్నారు.

405కు చేరిన నమూనాలు: జ్వరనిర్థరణ పరీక్షల కోసం సోమవారం నాటికి 405 రక్తనమూనాలను సేకరించారు. వీటిలో ఈ నెల 4న 62 మందికి సంబంధించి నెగెటివ్‌ ఫలితం వచ్చిందని జేసీ ప్రకటించగా మిగిలిన 300పైబడి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే కొందరు తలనొప్పి, జలుబు, తదితర స్వల్పసమస్యలతో బాధపడుతూ శిబిరంలో చికిత్స పొందగా జ్వర నిర్ధరణకు రక్తపరీక్షల ఫలితాలకు వేచి ఉండక తప్పనిపరిస్థితి. దీంతో అసలు జ్వరాల సమస్యకు కారణమేమిటో తేల్చడంలో జాప్యం జరుగుతోందంటూ గ్రామస్థుల్లో అసహనం వ్యక్తం అవుతోంది.

వదంతులు నమ్మవద్దు: ఆళ్ల నాని

ఏలూరు టూటౌన్‌: బోడిగూడెంలో విద్యార్థుల అస్వస్థతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఓ ప్రకటనలో కోరారు. ఆ గ్రామంలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామని, రెండు అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని తెలిపారు.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలే కారణం : జేసీ

చికిత్స పొందుతున్న బాలిక తల్లితో మాట్లాడుతున్న హిమాన్షుశుక్లా

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: నలుగురు విద్యార్థుల మృతికి జ్వరాలు కారణం కాదని జాయింట్‌ కలెక్టరు హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలే కారణమన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 4న మెంటి మధు దీర్ఘకాలికంగా కేన్సర్‌తో, గత నెల 26న ప్రశాంత్‌ మెనింజైటిస్‌తో, 25న జక్కు శ్రీను దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో మరణించారన్నారు. విద్యార్థులకు మాత్రమే జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణమేమిటన్న ప్రశ్నకు.. సమాధానంగా జడ్పీ హైస్కూలు నుంచి నీరు, బియ్యం, పప్పు, గుడ్లు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామన్నారు. నవంబరు 25న మరణం సంభవించిన నాటి నుంచి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన 50మంది విద్యార్థులు జ్వరాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్న ప్రచారం అవాస్తవమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని