తవ్వేకొద్దీ ఇంకా..
తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల మాయం
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులు గల్లంతైన ఘటనపై ఇద్దరు అధికారులు సస్పెండైన విషయం మరవకముందే తప్పుడు రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటకొచ్చింది. కార్యాలయం కేంద్రంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఆస్తులకు తప్పుడు రిజిస్ట్రేషన్ల ఘటన వెలుగు చూసింది. ఇదిలా ఉండగానే తాజాగా 71 (వాల్యూమ్స్) రిజిస్ట్రేషన్ పుస్తకాలు కనిపించడం లేదని ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ బీవీవీ సత్యనారాయణ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. కార్యాలయంలో 2012 నుంచి కంప్యూటరీకరణ అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని వాల్యూమ్స్‌గా భద్రపరిచారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రధాన వివరాలు వాటిల్లోనే ఉంటాయి. ఆ రికార్డులు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నెలల కిందట సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ కార్యాలయంలో స్టాంపులు, రికార్డులు, ఇతర లోటుపాట్లకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ క్రమంలోనే నాన్ జ్యుడీషియల్ స్టాంపులతో పాటు కీలకమైన 71 రికార్డులు మాయమైనట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మూడోస్థాయి విచారణ పూర్తికావాల్సి ఉంది. రికార్డులు ఎప్పుడు, ఎలా గల్లంతయ్యాయనే విషయం అధికారుల విచారణ చేస్తే తప్ప బయటపడే అవకాశం లేదు.
మరికొన్ని కార్యాలయాల్లో..
ఏలూరు వన్‌టౌన్, భీమడోలు, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెంతోపాటు జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్త్రాలు మాయమైనట్లు ప్రచారం సాగుతోంది. భీమడోలు కార్యాలయంలో పాత దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు వాటి వివరాలు నమోదు చేస్తున్నామని సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు. సమగ్రంగా దర్యాప్తు చేయాలని జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ శివరాం తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.