ఒళ్లూ బళ్లు గుల్ల !
బస్సుల ఆయువు తీస్తున్న రోడ్లు
తాడేపల్లిగూడెం: ఒకే రోజులో కమాన్ కట్టలు విరిగిపోయిన ఆరు బస్సులు
తాడేపల్లిగూడెం పట్టణం, భీమవరం అర్బన్, జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఎగుడుదిగుడు రహదారులపై ఉయ్యాలలూగే బస్సుల్లో ప్రయాణం ప్రయాణికులకు, సిబ్బందికి ప్రాణ సంకటంగా మారింది. అస్తవ్యస్త రహదారి వ్యవస్థ కారణంగా ఒకవైపు బస్సులు దెబ్బ తింటుండగా.. మరోవైపు కేఎంపీఎల్ దారుణంగా పడిపోతోంది. ఆర్టీసీకి నష్టం వస్తుండగా.. ప్రయాణికుల విలువైన సమయం హరీమంటోంది. మార్గం మధ్యలో బస్సులు నిలిచిపోతున్నందున ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
పెద్దపెద్ద గోతుల్లో పడినప్పుడు బస్సుకు ప్రాణం లాంటి కమాన్ కట్టలు విరిగిపోతున్నాయి. గూడెం డిపోనకు సంబంధించి నిత్యం 8 నుంచి 10 వరకు మూలకు చేరుతున్నాయి. గతేడాది విడిభాగాలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఖర్చయితే.. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.9 లక్షల వరకు అయ్యింది.
బస్సులు ఆలస్యం కావడంతో పడిగాపులు
రెట్టింపు సమయం.. జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం ప్రయాణ సమయం 1.40 గంటలు. కానీ పాడైన రోడ్ల కారణంగా 3 గంటలు పడుతోంది. ఒక ట్రిప్‌నకు 6 గంటలు పడుతోంది. H రహదారుల పరిస్థితి కారణంగా బస్సులు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఎక్కువ సేపు బస్టాండ్లు, బస్టాపుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇళ్ల నుంచి ముందుగా బయలుదేరి, ఆలస్యంగా ఇళ్లకు చేరుతున్నారు. ఇతర ప్రయాణికులదీ ఇదే పరిస్థితి.
గూడెం డిపో పరిధిలోని రాజమహేంద్రవరం, భీమవరం, జంగారెడ్డిగూడెం రూట్లలో ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ రూట్లు దారుణంగా ఉన్నాయి. రాజమహేంద్రవరానికి ఒక్క బస్సు నాలుగు ట్రిప్పులు వేయాల్సి ఉండగా మూడు ట్రిప్పులతోనే సమయం అయిపోతోంది.
భీమవరం డిపో నుంచి అత్యధికంగా విజయవాడకు బస్సులు తిరుగుతుంటాయి. చాలాకాలం నుంచి ఈ మార్గం దారుణంగా తయారైంది. తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం రోడ్లు దయనీయంగా మారాయి. ఈ కారణంగా డిపోనకు నష్టం వస్తోంది.
జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో పరిధిలోని అన్ని రహదారులు అధ్వానంగా మారాయి. ఈ కారణంగా గమ్యస్థానాలకు చేరాల్సిన సమయం రెట్టింపవుతోంది.
డ్రైవర్లకు వెన్నెముక సమస్య.. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పరిధిలో 175 మంది డ్రైవర్ల్లు, కండక్టర్లు పనిచేస్తున్నారు. 40 మంది డ్రైవర్లు వెన్నెముక సమస్యతో అవస్థలు పడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు కలిపి రోజుకు 20 మంది వరకు సిక్ లీవ్‌లో ఉంటున్నారు. రహదారుల దుస్థితి వల్లే వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారని యూనియన్ నాయకులు ఒక అధ్యయనం ద్వారా తెలుసుకుని ఉన్నతాధికారులకు వినతులు అందించారు. గ్యారేజీలో 24 గంటలూ బస్సులకు మరమ్మతులు చేయాల్సి వస్తోందని మెకానికల్ విభాగం సిబ్బంది చెబుతున్నారు.
మూడు నెలలుగా సెలవులో.. ‘తాడేపల్లిగూడెం- జంగారెడ్డిగూడెం రోడ్డు అధ్వానంగా ఉంది. ఆ రూట్లో బస్సులు నడపడం వల్లే వెన్నునొప్పి, కిడ్నీ సమస్యలొచ్చాయి. అనారోగ్య సమస్యలతో మూడునెలలుగా మెడికల్ లీవ్‌లో ఉన్నాను’ అని జంగారెడ్డిగూడెం డిపో డ్రైవర్ బి.కోటేశ్వరరావు తెలిపారు.
అన్ని బస్సులను సిద్ధం చేస్తాం.. తాడేపల్లిగూడెం డిపో పరిధిలోని బస్సులను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాం. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ ఛార్టులు వేసి అందరికీ సమాన రూట్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం. - డీఎం సత్యనారాయణమూర్తి
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.