భార్యను రోకలితో మోది హతమార్చిన భర్త
ధనలక్ష్మి (పాతచిత్రం)
పెరవలి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యను హతమార్చిన ఘటన పెరవలి మండలం నడుపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై ఎం.సూర్యభగవాన్ కథనం మేరకు నడుపల్లికి చెందిన ముత్యాల వెంకటేశ్వరరావు పెట్రోలు బంకులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు సంతానం. రెండేళ్ల కిందట భార్య ధనలక్ష్మి(37) వేరే మతంలో చేరింది. ఈ విషయంలో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున నిద్రపోతున్న భార్యపై వెంకటేశ్వరరావు రోకలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలకు ఇంట్లోని కొడుకు, కుమార్తె లేచి తండ్రిని వారించే ప్రయత్నం చేశారు. బయటకు వచ్చి గట్టిగా కేకలు వేస్తూ చుట్టుపక్కలవారిని లేపారు. ఈలోగా వెంకటేశ్వరరావు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తమోడుతోన్న ధనలక్ష్మిని తణుకులోని ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు.