అయ్యా.. ఇది న్యాయమేనా!
నిలిచిన పింఛనుతో వెతలు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేని వ్యక్తి ఒకరు, నడవలేని స్థితిలో ఉన్నవారు మరొకరు.. ఇలాంటి వారు తమకు నెలవారీ పింఛన్లు నిలిపేశారంటూ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో వాపోయారు.
ఎన్నిసార్లు విన్నవించినా.. మాది ఏలూరు నగరం. మా మరిది ఇల్షాద్ హుస్సేన్‌కు పుట్టుకతోనే అంగవైకల్యం ఉంది. దివ్యాంగుల కేటగిరీలో నెలవారీ పింఛను సొమ్ము అందేది. సాంకేతిక సమస్యతో నాలుగు నెలల నుంచి ఆపేశారు. అధికారుల చుట్టూ తిరిగినా పింఛను పునరుద్ధరించడం లేదు. -షాహినా ఫర్వీ
కొత్తగా కార్డు పొందినా.. నేను ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో ఉంటున్నా. పండు వయసులో ఉన్నా. పింఛను సొమ్మే ఆధారం. బియ్యం కార్డులో పేర్లున్న ఇద్దరికి వస్తున్నాయనే కారణంతో నాలుగు నెలల కిందట నిలిపేశారు. కొత్తగా బియ్యం కార్డు పొందా. అయినా మంజూరుచేయడం లేదు. గత నెలలోనూ ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదు చేశా. ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలి. -కాంతమ్మ, తిరుమలంపాలెం