logo

బరితెగింపు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా పందెంరాయుళ్ల పంతమే గెలిచింది. శుక్రవారం ఉదయం కొద్దిసేపు వేచిచూసిన వారంతా ఎక్కడికక్కడే బరులను సిద్ధం చేశారు. నిమిషాల్లో వేలాది మంది చేరిపోయారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టి పందేలను సాగించారు. వాటి మాటున గుండాట, కోతాట తదితర జూదాలను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లు చేతులు మారాయి.

Published : 15 Jan 2022 01:41 IST

జిల్లావ్యాప్తంగా కాలు దువ్విన కోళ్లు

 చేతులు మారిన రూ. కోట్లు


గుండుగొలనులో తలపడుతున్న కోళ్లు

భీమవరం పట్టణం, జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా పందెంరాయుళ్ల పంతమే గెలిచింది. శుక్రవారం ఉదయం కొద్దిసేపు వేచిచూసిన వారంతా ఎక్కడికక్కడే బరులను సిద్ధం చేశారు. నిమిషాల్లో వేలాది మంది చేరిపోయారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టి పందేలను సాగించారు. వాటి మాటున గుండాట, కోతాట తదితర జూదాలను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లు చేతులు మారాయి.

వర్షం కురుస్తున్నా.. ఓవైపు వర్షం కురుస్తున్నా నిర్వాహకులు ఏర్పాట్లలో ఏమాత్రం తగ్గలేదు. ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పందేల జోరు కొనసాగింది. మూడురోజుల పాటు నిర్వహించేలా బరుల్లో పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రాత్రివేళ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఫ్లడ్‌లైట్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచారు. ఇక బరుల్లో భౌతిక దూరమనేది పూర్తిగా విస్మరించారు. కొన్ని పందేలు రూ.10 వేల నుంచి రూ.1.5 లక్షలకు పైగా జరిగాయి. పైపందేలు రెట్టింపు స్థాయిలో కాశారు. వేలం పాటలో బరులను దక్కించుకున్న కొందరు సొమ్ములు రాబట్టుకునేలా వర్షంలో సైతం పందేలు ఆగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోళ్లను రంగును బట్టి రూ.9 వేలు ఆపై ధరకు విక్రయించారు. బరుల సమీపంలోనే మాంసం పకోడి, ఇతర ఆహార పదార్థాల దుకాణాలను ఏర్పాటు చేశారు.

ఇతర ప్రాంతాల నుంచి..

జిల్లాలోని కొన్ని బరుల్లో స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా కనిపించారు. రెండు రోజుల కిందటే జిల్లాకు చేరుకున్న జిల్లాయేతరులు పందేల వివరాలు తెలుసుకున్నారు. భోగి రోజున నచ్చిన చోటికి వాహనాల్లో తరలివెళ్లారు. బరుల్లో రూ.2 వేలు, రూ.500 నోట్లు ఎక్కువగా చేతులు మారాయి.

ఏజెన్సీ, మెట్టలోని 15 మండలాల్లో సుమారు 50 పెద్ద బరులు, 70 చిన్న బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు. బరుల వద్ద కోతాట, గుండాటలు యథేచ్ఛగా జరిగాయి. ప్రతిచోట రూ.లక్షల్లో చేతులు మారాయి. కుక్కునూరు మండలం శ్రీధరవేలేరు, జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం, కామయ్యపాలెం గ్రామాలకు తెలంగాణ నుంచి పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు.

లోసరి బరి వద్ద గుమిగూడిన జనం

తేతువాదే పైచేయి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని బరుల్లో తేతువాదే (తెలుపురంగు పుంజు) పైచేయి అయ్యింది. పందేలు నిర్వహించరాదని అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహించింది. హెచ్చరికలు చేస్తూ.. జూదాల జోలికి వెళ్లొద్దంటూ సూచనలిస్తూ.. ఆటల పోటీలతో కోడి పందేలను నిలువరించే ప్రయత్నాలు చేసింది. భోగి రోజు ఉదయం వరకు తెర వెనుకే ఉన్న తేతువా శుక్రవారం ఉదయం బరి తెగించింది. బరుల్లోకి మరికొన్నింటిని వెంటబెట్టుకొని వెళ్లింది. ఎటుచూసినా కొక్కొరోకో అనిపించేలా కూతపెట్టించింది. కొన్నిచోట్ల తేతువాకు వ్యతిరేకంగా ఉన్న పుంజులను బరుల దరిదాపుల్లోకి రానీయకుండా అడ్డుకుంది. కొత్తరకం పుంజులను బరుల నిర్వాహకులుగా తెర మీదికి తీసుకొచ్చి సత్తా చాటుకుంది.

జోరుగా..

డింకీ పందేలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మంతెన, గోకరాజు

ఉండి, న్యూస్‌టుడే: కాళ్ల మండలం సీసలిలో పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించారు. రూ.లక్షల్లో సొమ్ము చేతులు మారింది. డబ్బు లెక్కించేందుకు బరి సమీపంలో కౌంటింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి పందెంరాయుళ్లు తరలివచ్చారు. తొలుత డింకీ పందేలను ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త గోకరాజు రామరాజు ప్రారంభించారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి, నాయకులు విస్సాకోడేరులో పందేలను తిలకించారు.

ఉండ్రాజవరంలో గుండాట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని