logo

పల్లెల్లో సంక్రాంతి సవ్వడి

చలితో ఒణుకుతున్న ప్రతి మేనికి శుక్రవారం వేకువజామునే భోగి మంట వెచ్చని ఊపిరిలూదింది. నూతన వస్త్రాలు ధరించిన పిల్లాపాపలు, పండగకు వచ్చిన అతిథులతో పెద్దలంతా మమేకమై అల్పాహారంతో రోజును ఆరంభించారు. వాకిట్లో పెట్టిన గొబ్బిళ్లు ఆడటానికి వచ్చిన యువతుల నోట వినిపించిన పాటల పల్లవితో

Published : 15 Jan 2022 01:41 IST


పెనుగొండ మండలం వడలిలో భోగి మంట వెలుగులు

పాలకొల్లు, న్యూస్‌టుడే: చలితో ఒణుకుతున్న ప్రతి మేనికి శుక్రవారం వేకువజామునే భోగి మంట వెచ్చని ఊపిరిలూదింది. నూతన వస్త్రాలు ధరించిన పిల్లాపాపలు, పండగకు వచ్చిన అతిథులతో పెద్దలంతా మమేకమై అల్పాహారంతో రోజును ఆరంభించారు. వాకిట్లో పెట్టిన గొబ్బిళ్లు ఆడటానికి వచ్చిన యువతుల నోట వినిపించిన పాటల పల్లవితో పల్లెలన్నీ పండగ పల్లకీ ఎక్కాయి. సంగీత విభావరులతో సందడి చేసిన కళాకారులు ఒకవైపు.. గరగలు, మేళతాళాలతో గ్రామ దేవతల జాతరలు మరో వైపు సంక్రాంతి సందడిని రెట్టింపు చేశాయి. ఎన్నాళ్లయ్యిందో సరదాగా ఒక పంక్తి మాట కలిపి.. ఎన్నేళ్లయ్యిందో సహపంక్తిగా భోజనం చేసి అంతా కలిసి.. అనుకున్న స్నేహితులైతే ఒకరింట్లో ఒకరు భోగి రోజున కలిసిమెలిసి భోజనాలు ఆరగించారు. సంప్రదాయ దుస్తుల్లో యువత సంబరపడుతుంటే చూసే కళ్లన్నీ మురిసిపోయాయి. గొబ్బిళ్లు పెట్టుకున్న చిన్నారులను ముత్తయిదవులు, పెద్దలు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. తోచిన కానుకలిచ్చారు. ఇంటి ముంగిటకొచ్చిన హరిదాసులు, డూడూ బసవన్నలకు లేదు కాదనకుండా కానుకలిచ్చి తెలుగు వారి పెద్దమనస్సును పలువురు చాటుకున్నారు. బాల్యమిత్రులు ఒకచోట చేరి ఆయా పాఠశాలల్లో కలుసుకున్నారు. మెట్ట మొదలుకొని డెల్టా వరకు జిల్లాలో శుక్రవారం మొదలైన సంక్రాంతి సందడిని చూసిన వారంతా తగ్గేదేలే అనక మానరు.


కొవ్వలిలో సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి

వేంకన్న గ్రామోత్సవం

పెంటపాడు, న్యూస్‌టుడే: భోగి పండగను పురస్కరించుకొని శుక్రవారం జిల్లాలోని పలు దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దర్శిపర్రులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని గ్రామంలో ఊరేగించారు.


చిన్నారికి భోగిపళ్లు పోస్తున్న మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని