logo

నేత్రపర్వంగా గోదాదేవి కల్యాణం

ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో గోదాదేవి కల్యాణం శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీవారి నిత్య కల్యాణ మండపంలో జరిగిన ఆధ్యాత్మిక ఘట్టాన్ని భక్తులు తిలకించి తరించారు. భోగి పండగ రోజు శ్రీవారి ఆలయంలో గోదాదేవి కల్యాణం జరిపించడం ఆచారంగా వస్తోందని అర్చకులు తెలిపారు. దీనిలో భాగంగా కొండపైన

Published : 15 Jan 2022 01:41 IST


కల్యాణ క్రతువు జరిపిస్తున్న పండితులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో గోదాదేవి కల్యాణం శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీవారి నిత్య కల్యాణ మండపంలో జరిగిన ఆధ్యాత్మిక ఘట్టాన్ని భక్తులు తిలకించి తరించారు. భోగి పండగ రోజు శ్రీవారి ఆలయంలో గోదాదేవి కల్యాణం జరిపించడం ఆచారంగా వస్తోందని అర్చకులు తెలిపారు. దీనిలో భాగంగా కొండపైన ఉన్న శ్రీవారి నిత్య కల్యాణ మండపంలో స్వామి, ఉభయ దేవేరులతో పాటు గోదాదేవి అమ్మవారిని కొలువుదీర్చి కల్యాణాన్ని జరిపించారు. సన్నాయి, మంగళ వాయిద్యాల నడుమ ఈ కల్యాణ వేడుక కనుల పండువగా జరిగింది. పండితులు ముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం, మాంగల్య ధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని ఈ కల్యాణ క్రతువును తిలకించి పునీతులయ్యారు.

ఘనంగా భోగి వేడుకలు.. ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: భోగి పండగ సందర్భంగా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలోని ప్రధాన కూడళ్లలో భారీగా భోగి మంటలు వేశారు. వాటిలో పిడకలను చిన్నారులతో వేయించారు. ముందుగా ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ భోగి మంటలను వెలిగించారు. క్షేత్రానికి వచ్చిన యాత్రికులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఏటా పండగ మూడు రోజుల పాటు ఈ భోగి మంటలు వెలిగేలా ఈ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తుంటారు.


భోగి మంట వెలిగిస్తున్న ఈవో సుబ్బారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని