logo

స్వల్ప వివాదం.. పెను విషాదం

మద్యం మత్తులో వివాదానికి తెగబడి కత్తులతో దాడి చేసిన సంఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చాగల్లులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఎన్‌.ఫణికుమార్‌, స్టూడియో నిర్వహిస్తున్న మాచవరపు సురేష్‌ (29)

Published : 17 Jan 2022 04:18 IST

చాగల్లులో ముగ్గురిపై కత్తులతో దాడి

ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు


సురేష్‌ (పాత చిత్రం)

చాగల్లు, న్యూస్‌టుడే: మద్యం మత్తులో వివాదానికి తెగబడి కత్తులతో దాడి చేసిన సంఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చాగల్లులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఎన్‌.ఫణికుమార్‌, స్టూడియో నిర్వహిస్తున్న మాచవరపు సురేష్‌ (29), దుస్తుల వ్యాపారి వీర్ల రామకృష్ణలు బాల్య స్నేహితులు. ఈ నెల 13న ఫణికుమార్‌ ఛత్తీస్‌గఢ్‌ నుంచి స్వగ్రామం చాగల్లు వచ్చారు. శనివారం రాత్రి స్నేహితుడు రామకృష్ణకు చెందిన కారులో సినిమా చూసేందుకు ఈ ముగ్గురూ ధవళేేశ్వరం బయలు దేరారు. గ్రామ శివారు నందమూరు వంతెన సమీపంలో మద్యం తాగుతున్న కొందరు కారుకు అడ్డు పడి వీరితో తగాదాకు దిగారు. వారిలో ఒకరు ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపారు. కారు వెళ్తుండగా తగాదా పడిన వ్యక్తుల్లో ఇద్దరు మోటారుసైకిల్‌పై వారిని దాటి అడ్డుగా నిలిచి ఫోన్‌ చేసి మరికొందరిని రప్పించారు. అందరూ కలిసి ముగ్గురిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఫణికుమార్‌ పక్కనే ఉన్న గోతిలో పడిపోగా సురేష్‌, రామకృష్ణలపై వారు కత్తితో దాడి చేశారు. ముగ్గురూ మృతి చెందారని భావించి దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరువాత ఫణికుమార్‌ మేల్కొని తన స్నేహితులకు సమాచారం అందించారు. గాయాలపాలైన సురేష్‌, రామకృష్ణలను చాగల్లులో ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలో సురేష్‌ మృతి చెందారు. రామకృష్ణను రాజమహేంద్రవరంలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ బి.శ్రీనాథ్‌ పరిశీలించారు. ఫణికుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిందితులుగా భావిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపడుతున్నామన్నారు. వారు స్థానికులు కాదని, ఇక్కడకు ఎందుకు వచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నామన్నారు.

ఎదిగిన కొడుకు కానరాని లోకాలకు.. ఈ ఘటనలో మృతి చెందిన సురేష్‌కు ఇద్దరు అక్కలు. వారికి వివాహాలు అయ్యాయి. తండ్రి భాస్కర్‌కు సురేష్‌ చేదోడుగా ఉంటూ మూడేళ్ల నుంచి గ్రామంలో ఫొటోస్టూడియో నిర్వహిస్తున్నారు. అందివచ్చిన కొడుకు మరణవార్త విని సురేషన్‌ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని