logo

మళ్లీ చుట్టేస్తోంది

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. జిల్లాలో బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈనెల 17న 46 కేసులు నమోదైతే 18న 245కు పెరిగాయి. తాజాగా బుధవారం అదే ఉద్ధృతి కొనసాగుతూ 216కు చేరాయి. హోమ్‌ ఐసొలేషన్‌లో

Published : 20 Jan 2022 01:57 IST

పెరుగుతున్న కొవిడ్‌ ఉద్ధృతి

పండగ అనంతరం మారిన పరిస్థితి

జిల్లాలో ఇప్పటి వరకు రోజుకు 1,000 నుంచి 1,500 కరోనా పరీక్షలు చేసేవారు. ఈ సంఖ్యను ఇక నుంచి 2,500కు పెంచారు. ట్రూనాట్‌, ర్యాపిడ్‌ టెస్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. జిల్లాలో బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈనెల 17న 46 కేసులు నమోదైతే 18న 245కు పెరిగాయి. తాజాగా బుధవారం అదే ఉద్ధృతి కొనసాగుతూ 216కు చేరాయి. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నవారిపై నిఘా లేకపోవటం, ప్రజలు నిబంధనలు విస్మరించి తిరగటం, సంక్రాంతి నేపథ్యంలో రాకపోకలు ఎక్కువ కావటం వంటి పరిణామాలు మహమ్మారి ఉద్ధృతికి కారణాలుగా చెబుతున్నారు. తణుకులో ఈనెల 18న ఆసుపత్రి వద్ద 80 మందికి కొవిడ్‌ పరీక్షలు చేస్తే 20 మందికి పాజిటివ్‌ వచ్చిందంటే కేసుల పెరుగుదలను అంచనా వేయొచ్ఛు

ఆలస్యంగా నివేదికలు.. కొవిడ్‌ పరీక్షల నివేదికలు 24 గంటల్లో రావాలని స్పష్టమైన ఆదేశాలున్నా కొన్ని చోట్ల అమలు కావటం లేదు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, చింతలపూడి, కామవరపుకోట తదితర ప్రాంతాల్లో కరోనా పరీక్షల నివేదికలు రెండు రోజులకు వస్తున్నాయని చెబుతున్నారు. ఈలోగా కొందరు బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు.. ఆకివీడు లో డిజిటల్‌ అసిస్టెంట్‌కు, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసు పత్రిలో వైద్యురాలు, ఇద్దరి సిబ్బందికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. బుధవారం మరో 14 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. దీంతో మూడు రోజుల వ్యవధిలోనే జిల్లాలో మొత్తం 23 మంది ఉపాధ్యాయులకు, ముగ్గురు ఇతర సిబ్బందికి కరోనా సోకినట్లయింది.

ఇవీ కారణాలు.. జిల్లాలో కేసులు పెరగటానికి మొదట్నుంచీ సరైన పర్యవేక్షణ లేకపోవటమే కారణమని పలువురు చెబుతున్నారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వారు బయటకు వెళ్లకుండా కట్టడి చేసే పరిస్థితులు లేవు.

ఎక్కడ చూసినా జనమే.. గత నెలలో క్రిస్మస్‌, ఆ తరువాత కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగ నేపథ్యంలో రాకపోకలు పెరిగాయి. వ్యాపార కూడళ్లల్లో రద్దీ పెరిగింది. సినిమా హాళ్లు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంటుల్లో వేరే చెప్పనక్కరలేదు. సంక్రాంతి పండగకు ఇతర ప్రాం తాల నుంచి బంధువులు రావటంతోపాటు విచ్చలవిడిగా సాగిన కోడిపందేలు, జూదాల్లో వివిధ వర్గాల ప్రజలు పాలుపంచుకోవటం కూడా వైరస్‌ వ్యాప్తికి కారణాలుగా చెప్పుకోవచ్ఛు

ఆసుపత్రుల్లో ప్రారంభమైన సేవలు..

జిల్లాలో తొలివిడతగా మొత్తం 55 ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో బుధవారం నుంచి సేవలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సేవలు కొనసాగుతుండగా కొత్తగా తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, నరసాపురం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక పడకలను కేటాయించారు. ఇప్పటికే కొవిడ్‌ కేర్‌ సెంటర్లు కొనసాగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు కూడా రెండురోజుల్లో ప్రారంభించనున్నారు. మొత్తం 2 వేల పడకలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని