logo

కేసులకు తగ్గట్లు పెంచరేం

జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా.. అధికారులు పరీక్షల సంఖ్య మాత్రం పెంచట్లేదు. పక్క జిల్లా కృష్ణాలో రోజుకి ఎనిమిది వేల పరీక్షలు చేస్తోంటే జిల్లాలో ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయం. సరిగ్గా నెల క్రితం జిల్లాలో 2,500 వరకు

Published : 23 Jan 2022 03:53 IST

నెల క్రితం పాజిటివిటీ రేటు 0.36, ఇప్పుడు 27.64

పరీక్షలు మాత్రం అప్పుడెంతో.. ఇప్పుడూ అంతే

ఈనాడు డిజిటల్‌, ఏలూరు

జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా.. అధికారులు పరీక్షల సంఖ్య మాత్రం పెంచట్లేదు. పక్క జిల్లా కృష్ణాలో రోజుకి ఎనిమిది వేల పరీక్షలు చేస్తోంటే జిల్లాలో ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయం. సరిగ్గా నెల క్రితం జిల్లాలో 2,500 వరకు కొవిడ్‌ పరీక్షలు చేసేవారు. గతేడాది డిసెంబరు 22న జిల్లాలో కేసుల సంఖ్య తొమ్మిది. అంటే పాజిటివిటీ రేటు 0.36. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి శనివారం ఉదయం తొమ్మిది గంటల వరకు జిల్లాలో వెలుగు చూసిన కేసుల సంఖ్య 691. అంట పాజిటివిటీ రేటు.. 27.64కి చేరినా పరీక్షల సంఖ్య అంతే. రోజుకు 20 నుంచి 50 మంది వస్తున్నా.. వారిలో చాలా మందికి కొవిడ్‌ లక్షణాలు ఉంటున్నా.. జిల్లాలో చాలా చోట్ల పరీక్షలు అయిదు నుంచి పది మందికే చేస్తున్నారు.

కొవిడ్‌ పరీక్షలు, బాధితులకు సహాయ సహకారాలు, ఫీవర్‌ సర్వే వంటి.. ముందుజాగ్రత్త చర్యల్లో యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో పది, పదిహేను రోజులకు ఓసారి ప్రతి ఇంటికీ వెళ్లి.. జ్వరపీీడితులున్నారా..? వారికి ఏవైనా కొవిడ్‌ లక్షణాలున్నాయా.. పరీక్షలు అవసరమా అనే విషయాలను ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, వాలంటీర్లు.. పరిశీలించేవారు. ఇప్పుడలాంటి ప్రయత్నమే జరగట్లేదు. కొవిడ్‌ నిర్థరణ అయిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేసే ప్రక్రియకూ స్వస్తి పలికారు.పైగా ‘మేం కొవిడ్‌ బారిన పడ్డట్లు అనుమానముంది టెస్టులు చేయండి మహా ప్రభో’ అంటూ.. ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారిని వెనక్కి పంపించేస్తున్నారు. జిల్లాలో విరివిగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేస్తాం.. వేలకు వేలు పరీక్షలు చేస్తామని ఒమిక్రాన్‌ తొలికేసు బయటపడిన నేపథ్యంలో దాదాపు నెల క్రితం చెప్పిన అధికారులు ఇప్పుడు 2,000 నుంచి 2,500 పరీక్షలకే పరిమితమవుతున్నారు. ఇలా ఎందుకంటే.. ఐసీీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం లక్షణాలున్నవారికే చేయాలని చెబుతున్నారు.. అధికారులు గతంలో జిల్లాలో రోజుకు 9,000 వరకు పరీక్షలు చేయగలమని చెప్పారు. ఆ లెక్కన చేస్తే అధికారికంగా ఎన్ని కేసులు వెలుగు చూస్తాయో.

తాడేపల్లిగూడెంలో ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా రోజుకి పది పరీక్షలే చేస్తున్నారు. దీంతో మిగిలినవారు ప్రైవేటు ఆసుపత్రులకెళ్తే.. వివిధ రకాల పరీక్షల పేరుతో కనీసం రూ.అయిదు వేలు, కరోనా ఉంటే మరో రూ.అయిదు వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

తాడేపల్లిగూడెంలో ఫీవర్‌ సర్వే సర్వరు పనిచేయట్లేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇంటింటి ఫీవర్‌ సర్వేను ప్రస్తుతం ఆపేసి వారంతా ఆస్తి పన్ను సర్వే చేస్తున్నారు. పురపాలక కమిషనర్‌ ఆదేశాలతో చేస్తున్నామని వారు చెబుతున్నారు.

లక్షణాలున్నా.. వెనక్కి వెళ్లాల్సిందే

లింగపాలెం మండల పరిధిలో ఉన్న మూడు పీహెచ్‌సీలకు రోజుకు సుమారు 50 నుంచి 60 మంది చొప్పున వస్తున్నారు. కానీ ఆయా పీహెచ్‌సీల సిబ్బంది మాత్రం ఐదుగురికే పరీక్షలు చేస్తున్నారు. లక్షణాలున్నా.. మిగిలిన వారిని వెనక్కి పంపేస్తున్నారు. ఇలా ఎందుకని అడిగితే.. ఎక్కువ చేయొద్దని ఆదేశాలున్నాయని చెబుతున్నారు. కిట్లు మాత్రం ఒక్కో ఆసుపత్రిలో వందకు పైగానే ఉండటం గమనార్హం.

23 మంది ఉపాధ్యాయులకు

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు 23 మందికి తాజాగా కరోనా సోకింది. బోధనేతర సిబ్బంది ఒకరు కూడా దీని బారిన పడ్డారని శనివారం విడుదలైన వైద్య పరీక్షల నివేదికల్లో తేలిందని జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

జిల్లాలో 17 కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో 17 కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ అంబేడ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 890 పడకలతో వీటిని ప్రారంభించినట్లు వెల్లడించారు. వీటి పర్యవేక్షణకు నాన్‌-మెడికల్‌ నోడల్‌ అధికారులను నియమించామన్నారు. ప్రతి హెల్ప్‌ డెస్క్‌నకు మేనేజర్లను, 9 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించినట్లు వెల్లడించారు.

జిల్లాలో కొవిడ్‌ ఆసుపత్రులు 55

ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు 44మంది

వీరిలో ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్న వారు 30 మంది

కరోనా సమాచారం

శుక్రవారం నమోదైనవి : 691

మొత్తం కేసులు : 1,82,748

కోలుకున్నవారు : 1,80,117

మృతులు : 1,126

యాక్టివ్‌ : 1,505

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని