logo

ఉద్యోగుల పోరు బాట

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ బిల్లులను ప్రక్రియ చేయొద్దని జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పాండురంగారావు చెప్పారు. ఆ సంఘ జిల్లా స్థాయి అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని స్థానిక ఖజానా కార్యాలయంలో శనివారం నిర్వహించారు.

Published : 23 Jan 2022 03:53 IST

పీఆర్‌సీ జీవోల రద్దుకు

పీఆర్‌సీ జీవోను రద్దు చేయాలని నరసాపురం

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ధర్నా

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ బిల్లులను ప్రక్రియ చేయొద్దని జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పాండురంగారావు చెప్పారు. ఆ సంఘ జిల్లా స్థాయి అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని స్థానిక ఖజానా కార్యాలయంలో శనివారం నిర్వహించారు. అధ్యక్షత వహించిన పాండురంగారావు మాట్లాడుతూ కొత్త పీఆర్‌సీపై జారీ అయిన జీవోలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా సదరు బిల్లుల ప్రక్రియ కొనసాగించాలంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్లకు ఆర్థికంగా నష్టం కలిగించే విధంగావున్న పీఆర్‌సీ జీవోలను ప్రభుత్వం రద్దు చేసేవరకు పీఆర్‌సీ సాధన సమితికి ఖజానా ఉద్యోగులు మద్దతు తెలపాలని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో సంఘ జిల్లా కార్యదర్శి కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా ఖజానా శాఖ డీడీ టి.కృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఖజానా శాఖ డీడీ కృష్ణకు వినతి పత్రం

అందజేస్తున్న ఆ శాఖ ఉద్యోగుల సంఘ నాయకులు

ఎంతో మోసం.. ఏలూరు గ్రామీణ : ఐఆర్‌ కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ను ప్రకటించి హెచ్‌ఆర్‌ఏను తగ్గించి ప్రభుత్వ ఉద్యోగులందరిని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏలూరు యూనిట్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

నరసాపురం: రివర్సు పీఆర్‌సీ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ధర్నా చేశారు.

నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలనే డిమాండ్‌తో పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక పవరుపేటలోని ఎన్‌జీవో హోమ్‌లో నిర్వహించనున్నట్లు ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ హరనాథ్‌, ఏపీ ఐకాస అమరావతి జిల్లా ఛైర్మన్‌ రమేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పీఆర్‌సీ, హెచ్‌ఆర్‌ఏ స్లాబులు, సీపీఎస్‌ విధానం, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ సమావేశంలో చర్చించిన అనంతరం పలు తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐకాసలో భాగస్వామ్యం ఉన్న అన్ని సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.

అండగా ఉంటాం: తెదేపా

భీమడోలు, న్యూస్‌టుడే: మెరుగైన పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తెదేపా అండగా ఉంటుందని ఆపార్టీ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలులోని పార్టీ కార్యాలయంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కొండబాబుతో కలసి ప్రభుత్వ ఉద్యోగుల పోరాటాలపై ఆయన శనివారం మాట్లాడారు. పీఆర్సీ పేరుతో ఉద్యోగులను రెండేళ్లపాటు ఊరించిన ముఖ్యమంత్రి జగన్‌ చివరకు దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని విధంగా రివర్స్‌ పీఆర్సీని ప్రకటించారన్నారు. ఉద్యోగులతోపాటు విశ్రాంత ఉద్యోగులకు చేసే చెల్లింపుల్లో కోత పెట్టడం దారుణమన్నారు. మోసపూరిత పీఆర్సీ ప్రకటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, న్యాయం కోసం ఉద్యోగులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు