logo

హత్యకేసులో 9 మంది నిందితుల అరెస్టు

చాగల్లు శివారులో ఈ నెల 15న జరిగిన హత్య కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నిడదవోలు సీఐ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. నిడదవోలులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..

Published : 23 Jan 2022 03:53 IST

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటేశ్వరరావు,

చిత్రంలో నిడదవోలు, చాగల్లు ఎస్సైలు నాగరాజు, రమేష్‌

నిడదవోలు, న్యూస్‌టుడే: చాగల్లు శివారులో ఈ నెల 15న జరిగిన హత్య కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నిడదవోలు సీఐ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. నిడదవోలులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కొవ్వూరు మండలం ఆరికిరేవులకు చెందిన జొన్నకూటి రవీంద్రబాబు తన కుమారుడి పుట్టినరోజు వేడుకకు తన బంధువులను పిలవడానికి చాగల్లులోని తన బావమరిది తిగిరిపల్లి సుమంత్‌ ఇంటికి వచ్చాడు. అక్కడ బంధువులతో గొడవపడగా వారు కొవ్వూరులోని తన స్నేహతులైన తాలపాకల ఉదయ్‌రత్నకిరణ్‌, కామన శ్రీనివాస్‌ సాయికుమార్‌, సవరపు సుమిత్‌రత్నం, సవరపు సందీప్‌, సారపల్లి రాజేష్‌, పంపని శ్రీనివాస్‌, గారపాటి లక్ష్మిగణపతిలను పిలిచారు. వారు కొవ్వూరు నుంచి రాగా గొడవ సద్దుమణిగిందని తిరిగి ఇంటికి వెళ్తూ చాగల్లు-కొవ్వూరు మధ్య నందమూరు మార్గంలోని చాగల్లు గ్రామ శివారులోని వంతెనపై ఆగి మద్యం తాగారు. ఇదే సమయంలో చాగల్లు నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న కారును సారపల్లి రాజేష్‌ ఆపగా వారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయారు.

వెంబండించి...తాలపాకల ఉదయ్‌రత్నకిరణ్‌, కామన శ్రీనివాస్‌సాయికుమార్‌లు ద్విచక్ర వాహనంపై కారును వెంబడించి ఆపారు. వంతెనపై ఉన్న మిగిలిన స్నేహితులు కారు వద్దకు వెళ్లారు. వీరంతా కారులోని వారితో గొడవపడి కొట్టారు. ఉదయ్‌రత్నకిరణ్‌ తన జేబులో ఉన్న చాకుతో కారులో ఉన్న చాగల్లుకు చెందిన ఫొటోగ్రాఫర్‌ మాచవరపు సురేష్‌కుమార్‌, రామకృష్ణను పొడిచాడు. దీంతో సురేష్‌కుమార్‌ మృతి చెందగా, రామకృష్ణకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నారు. కారులోని మరో వ్యక్తి ఫణికుమార్‌ సురక్షితంగా బయటపడ్డారు. తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం కొవ్వూరులోని మెరకవీధిలో తిగిరిపల్లి సుమంత్‌ ఇంటి వద్ద ఈ 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో నిడదవోలు, చాగల్లు ఎస్సై పి.నాగరాజు, రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని