logo

ఈ పీఆర్‌సీ మాకొద్దు

ఉద్యోగులకు నష్టదాయకంగా ఉన్న ఈ పీఆర్‌సీ మాకొద్దంటూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముక్తకంఠంతో నినదించారు. పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు దశలవారీగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లాలోని

Published : 27 Jan 2022 06:00 IST

అంబేడ్కర్‌ విగ్రహాలకు ఐకాస వినతులు


ఏలూరు: అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇస్తున్న ఐకాస నాయకులు

ఏలూరు అర్బన్‌, భీమవరం పట్టం, న్యూస్‌టుడే: ఉద్యోగులకు నష్టదాయకంగా ఉన్న ఈ పీఆర్‌సీ మాకొద్దంటూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముక్తకంఠంతో నినదించారు. పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు దశలవారీగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించగా ఐకాస జిల్లా నాయకులు ఏలూరు పాత బస్టాండ్‌ కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఐకాస నాయకులు హరనాథ్‌, నారాయణ, విద్యాసాగర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఐకాస ఆధ్వర్యంలో గురువారం నుంచి కలెక్టరేట్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భీమవరంలో ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల జేబులు కత్తిరించేలా రివర్స్‌ పీఆర్సీని ప్రవేశపెట్టడం సిగ్గుచేటని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న చీకటి జీవోల విడుదలను నిరసిస్తున్నాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ప్రకటించాలి. - వి.శోభన్‌, ఏపీఎన్‌జీవో భీమవరం తాలూకా కోశాధికారి

అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దుచేస్తానని, ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలు అధికారం కోసమో, రాష్ట్ర ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఇప్పుడు తేటతెల్లమవుతుంది. - బి.గోపీమూర్తి, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

సీపీఎస్‌ విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం కాదు.. సీఎం ముందుకొచ్చి స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో సంఘటితంగా పోరాడతాం.- ఎల్‌.సాయిశ్రీనివాస్‌, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు 

పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు విలువలేని విధంగా ప్రభుత్వ తీరు ఉంది. ఇప్పటికైనా సరిచేసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. - ఎస్‌.కృష్ణమోహన్‌, మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగానే ముందుకెళ్తారని.. వినతులతో సరిపెడతారని భావించి తక్కువగా అంచనా వేస్తే ఇబ్బందికర పరిస్థితికి ప్రభుత్వం వెళ్లక తప్పదు. - వి.సత్యనారాయణమూర్తి, ఏపీఎన్‌జీవో భీమవరం తాలూకా అధ్యక్షుడు


భీమవరం: ప్రదర్శనలో పీఆర్సీ సాధన సమితి నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని