logo

ఎన్నెన్నో మార్పులు ..చేర్పులు !

కొత్త జిల్లాల ఏర్పాటుకు రాజపత్రం వెలువడటంతో పశ్చిమలో అనేక నైసర్గిక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండనుండగా, ఏలూరు కొత్త జిల్లాగా అవతరిస్తుంది. గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లనున్నాయి. భీమవరం

Published : 27 Jan 2022 06:00 IST

కొత్త జిల్లాల ఏర్పాటుకు రాజపత్రం వెలువడటంతో పశ్చిమలో అనేక నైసర్గిక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండనుండగా, ఏలూరు కొత్త జిల్లాగా అవతరిస్తుంది. గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లనున్నాయి. భీమవరం కొత్తగా రెవెన్యూ డివిజన్‌ కానుండగా, కుక్కునూరు డివిజన్‌ జంగారెడ్డిగూడెంలో కలిసిపోనుంది. నూజివీడు రెవెన్యూ డివిజన్‌ ఏలూరు జిల్లాలో కలవనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో చోటు చేసుకోనున్న అంశాలన్నీ ఆసక్తికరంగానే ఉండనున్నాయి. తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే:

అంతా ఒకే గొడుగు కిందకు..

 

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: కొత్త జిల్లాల ఏర్పాటుతో జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌ స్వరూపం మారనుంది. తొమ్మిది మండలాలతో ఏర్పాటయ్యే ఈ డివిజన్‌ మెట్ట, ఏజెన్సీ మండలాల సమాహారంగా ఉండనుంది. ఇప్పుడున్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాలతోపాటు కామవరపుకోట, టి.నరసాపురం మండలాలు, నిర్వాసిత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కొత్త డివిజన్‌లో కలవనున్నాయి. తద్వారా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం స్థాయికి ఈ డివిజన్‌ హోదా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశంలోనే ప్రత్యేకమైన పోలవరం ప్రాజెక్టు ఈ డివిజన్‌లోనే ఉంది. ప్రాజెక్టుతోపాటు నిర్వాసితులకు ఇక్కడే పునరావాసం కల్పిస్తున్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతం ప్రత్యేకంగా నిలుస్తుంది. పోలవరం నియోజకవర్గం పూర్తిగా రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకే రానుంది. గతంలో ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లో నాలుగు మండలాలు జంగారెడ్డిగూడెం, రెండు కుక్కునూరు, ఒక మండలం ఏలూరు డివిజన్‌లో ఉండేవి. ఈ ఏడింటిని ఒకే గొడుగు కిందకు తెస్తున్నారు. నాలుగు మండలాలతో ఉన్న చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాలు మాత్రమే ఈ డివిజన్‌ పరిధిలో ఉండనున్నాయి. మిగిలిన చింతలపూడి, లింగపాలెం నూజివీడు రెవిన్యూ డివిజన్‌ (కొత్త ఏలూరు జిల్లా) పరిధిలోనికి వెళ్తున్నాయి. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం గ్రేడ్‌-2 మున్సిపాల్టీ కీలక పట్టణం కానుంది.

 

ప్రస్తుతం ఉన్న మండలాలు : 5

కొత్తగా చేరేవి : 4

‘చింతల’పూడి..

చింతలపూడి, న్యూస్‌టుడే: కొత్త జిల్లాల ఏర్పాటుతో చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాలను కృష్ణా జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్‌లోకి కలపనున్నారు. ఈ రెండు మండలాలకు నూజివీడు 50 కి.మీ పైగా దూరంలో ఉంది. నూజివీడు వెళ్లాలంటే బస్సు సౌకర్యం కూడా సక్రమంగా లేదు. ఇప్పటివరకు ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో ఈ రెండు మండలాలు ఉండేవి. కలెక్టర్‌ కార్యాలయంతో పాటు అన్ని జిల్లా కార్యాలయాలు అక్కడే ఉండటంతో అన్ని పనులు చక్కబెట్టుకునేవారు. ఈ రెండు మండలాల నుంచి ఏలూరుకు నిత్యం బస్సులు ఉంటాయి. నూతన మార్పు దూరాభారంతో పాటు ఆర్థిక భారం కానుంది.

కీలక పట్టణాలన్నీ ఒకే డివిజన్‌లోకి..

నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలు కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. వీటిలో పెనుగొండ, పెనుమంట్రను నరసాపురం డివిజన్‌లోకి.. తణుకు, అత్తిలి, ఇరగవరంతోపాటు ఇప్పటి వరకు ఏలూరు డివిజన్‌ పరిధిలో ఉన్న తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు కొత్తగా ఏర్పడబోయే భీమవరం డివిజన్‌లో కలపనున్నారు. దీంతో ఇప్పటి వరకు పశ్చిమలో కీలకంగా ఉన్న ఆక్వా జోన్‌ భీమవరం, పారిశ్రామిక పట్టణం తణుకు, వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెం ఒకే డివిజన్‌ పరిధిలోకి రానున్నాయి. పుణ్యక్షేత్రాలైన పెనుగొండ, పాలకొల్లు, గునుపూడి పశ్చిమలోనే ఉంటాయి. కొత్త ప్రతిపాదనతో నరసాపురం రెవెన్యూ డివిజన్‌లో నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలు ఉంటాయి. భీమవరం రెవెన్యూ డివిజన్‌లో భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఉండనున్నాయి.

అన్నీ ఆసక్తికరమే..

●కొల్లేరు ప్రాంతమంతా పూర్తిగా ఏలూరు జిల్లా పరిధిలోనికి వచ్చేయనుంది. ఇంతకుముందు కొంత భాగం కృష్ణా జిల్లాలోనూ ఉండేది. ● ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం భీమవరానికి 17 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఏలూరు జిల్లాలోకి వెళ్లిపోయింది. ● కొయ్యలగూడెం మండల కేంద్రం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లాలంటే దాదాపు 40 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది. మార్పు జరిగితే 4 కి.మీ. దూరంలోనే రాజమహేంద్రవరం జిల్లాలోని గోపాలపురం మండలం మొదలవుతోంది. ● పోలవరం నుంచి కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురం వచ్చే రహదారిలో దొండపూడి, సాగిపాడు అనే గ్రామాలు తగులుతాయి. ఈ రెండు గ్రామాలు.. రాజమండ్రి జిల్లాలో కలుస్తాయి. ● నూతనంగా ఏర్పడే ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం కీలక పట్టణంగా మారనుంది. మన్యం గ్రామాలకు ముఖద్వారం కావడంతోపాటు, నిర్వాసిత గ్రామాలన్నీ దీని పరిధిలోకే వస్తాయి. ● పోలవరం ప్రాజెక్టుతోపాటు, మధ్య తరహా ప్రాజెక్టులైన ఎర్రకాలువ, కొవ్వాడ, జల్లేలు, జలాశయాలు ఏలూరు జిల్లా పరిధిలోనికి రానున్నాయి.

ద్వారకాతిరుమల తూర్పులోకి..

చాగల్లు, కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: తాజా పరిణామాలతో కొవ్వూరు డివిజన్‌ పరిధిలోని మండలాల కూర్పులో మార్పులు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, రాజమహేంద్రవరం అర్బన్‌, గ్రామీణ, అనపర్తి, రాజానగరం ఉన్నాయి. ఈ స్వరూపంలో మార్పు లేనప్పటికీ ఇప్పటి వరకూ కొవ్వూరు డివిజన్‌లో ఉన్న అత్తిలి, పెనుమంట్ర, ఇరగవరం, పెనుగొండ, తణుకు మండలాలు నరసాపురం జిల్లాలో కలిసిపోనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కానున్న రాజమహేంద్రవరానికి కొవ్వూరు 8 కి.మీ.దూరంలో అతి చేరువలో ఉండగా ద్వారకాతిరుమల నుంచి జిల్లా కేంద్రానికి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు