logo

కుక్కునూరు డివిజన్‌కు మంగళం

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జిల్లాలో కుక్కునూరు రెవెన్యూ డివిజన్‌ తెరమరుగు కానుంది. రెండు మండలాలు, 47 రెవెన్యూ గ్రామాలతో ఏర్పడిన ఈ గిరిజన ప్రాంత డివిజన్‌ను జంగారెడ్డిగూడెంలో విలీనం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లలో స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు ముందువరకు తెలంగాణలోని ఖ

Published : 27 Jan 2022 06:00 IST

ముగిసిన ఏడేళ్ల ప్రస్థానం

కుక్కునూరు, న్యూస్‌టుడే: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జిల్లాలో కుక్కునూరు రెవెన్యూ డివిజన్‌ తెరమరుగు కానుంది. రెండు మండలాలు, 47 రెవెన్యూ గ్రామాలతో ఏర్పడిన ఈ గిరిజన ప్రాంత డివిజన్‌ను జంగారెడ్డిగూడెంలో విలీనం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లలో స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు ముందువరకు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతాన్ని విభజనలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేశారు. పోలవరం ముంపు ప్రాంతంగా ఉన్న ఈ డివిజన్‌, ప్రాజెక్టు నిర్మాణంలో కీలకం కావటంతో ఈ ప్రాంతాన్ని ఏపీకి కేటాయిస్తూ 2014లో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. తొలుత జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లో కలుపుతూ ఉత్తర్వులు జారీ కాగా, ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం ఏలూరుకు, డివిజన్‌ కేంద్రం జంగారెడ్డిగూడేనికి సమీపంలో లేకపోవటంతో ఇక్కడ ప్రజానీకం అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త డివిజన్‌గా రాజపత్రం జారీ అయింది. కుక్కునూరు, వేలేరుపాడు పూర్వపు మండలాలతో పాటు, బూర్గంపాడు మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాలతో ఈ డివిజన్‌ రూపాంతరం చెందింది. దాదాపు 300 చ.కి.మీ. వైశాల్యంతో, 47 రెవెన్యూ గ్రామాలతో కొనసాగుతున్న ఈ డివిజన్‌ ఈ ఉగాది నాటికి జంగారెడ్డిగూడెం డివిజన్‌లో విలీనం కానుంది.

సదుపాయాలు లేక..

రెవెన్యూ డివిజన్‌ అన్న పేరే తప్ప, ఎప్పుడూ ఆ స్థాయిలో ఈ కేంద్రం కొనసాగిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉపకలెక్టర్‌లుగా ఐఏఎస్‌ స్థాయి అధికారులను నియమించటం, వారు నివాసం ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవటంతో వారు డివిజన్‌ ప్రధాన కేంద్రాన్నే మార్చేశారు. ఐటీడీఏ ఉన్న కె.ఆర్‌.పురాన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా చేసుకుని పాలన జరిపారు. తొలుత సాగిలి షన్మోహన్‌ ఉపకలెక్టర్‌గా వచ్చారు. కొద్ది నెలలు ఆయన ఇక్కడ నుంచే డివిజన్‌ కార్యకలాపాలు కొనసాగించారు. ఆయనకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా కూడా అదనపు బాధ్యతలు ఉండటం, అక్కడ అధికార నివాసం, ఇతరత్రా సౌకర్యాలు ఉండటంతో ఈ కార్యాలయ పాలనను అక్కడ నుంచే కొనసాగించటం ఆరంభించారు. కొద్దిరోజులు తర్వాత కార్యాలయం పూర్తిగా ఐటీడీఏ కు మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన అధికారులు కూడా ఇదే తరహాలో డివిజన్‌ కార్యకలాపాలు కొనసాగించారు. ఇక్కడ కార్యాలయం ఉన్నా అందులో ఒక ఉద్యోగి మాత్రమే ఉండేవారు. రాజకీయ పార్టీలు సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సమయంలో వినతి పత్రం సీ్వీకరించేందుకు ఆ అధికారి ఉపయోగపడేవారు. డివిజన్‌ అన్న సంతోషం కొన్ని నెలలుగా ఈ ప్రాంత ప్రజలు అనుభవించలేకపోయారు.

ముంపు పేరిట..

రెవెన్యూ డివిజన్‌ అయిన తొలి రోజుల్లో ఈ ప్రాంతం రూపురేఖలు మార్చేస్తామని నాయకులు ప్రకటించారు. హుటాహుటిన ఆర్డీవో కార్యాలయం, మినీ ఐటీడీఏ, అతిథి గృహాలను మంజూరుచేశారు. వీటిలో కోసం రూ.60 లక్షలు కేటాయిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఇంతలో జిల్లా యంత్రాంగానికి పోలవరం ముంపు గుర్తుకొచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దుచేశారు. దీంతో ఇక్కడ తగిన వసతులు సమకూరక ఐటీడీఏకు డివిజన్‌ కేంద్రాన్ని మార్చాల్సిన దుస్థితి తలెత్తింది. దాదాపు ఏడేళ్లపాటు నిర్జీవంగా కొనసాగిన ఈ డివిజన్‌ మరో రెండు నెలల్లో తన అస్థిత్వాన్ని పూర్తిగా కోల్పోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని