logo

ఈ పండ్లు ఆరోగ్యానికి హానికరం

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ ఇప్పుడు ఆ జాబితాలో పండ్లు కూడా చేరాయి. అదేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. నిగనిగలాడే ప్రతి పండు వెనుక రసాయన జాడలు మెండుగా ఉంటున్నాయి. కొనుక్కుని తిన్నామా అనారోగ్యాన్ని ఒంట్లోకి

Published : 20 May 2022 06:03 IST

మాగబెట్టేందుకు విరివిగా రసాయనాల వినియోగం  
 ప్రజారోగ్యంతో చెలగాటం  


రసాయనం పిచికారీ చేసిన అరటి

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ ఇప్పుడు ఆ జాబితాలో పండ్లు కూడా చేరాయి. అదేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. నిగనిగలాడే ప్రతి పండు వెనుక రసాయన జాడలు మెండుగా ఉంటున్నాయి. కొనుక్కుని తిన్నామా అనారోగ్యాన్ని ఒంట్లోకి తెచ్చుకున్నట్లే. అరటి, మామిడి, సపోట తదితర పండ్లను మాగపెట్టే సంప్రదాయ విధానాలకు విక్రయదారులు స్వస్తి పలికారు. రసాయనాలను పిచికారీ చేసి గంటల వ్యవధిలోనే పచ్చికాయలను పండ్లుగా మారుస్తున్నారు. లాభం వస్తే చాలు.. కొన్నవాళ్ల  ఆరోగ్యం గురించి మాకెందుకు అన్న ధోరణిలో సాగుతున్నారు. కృత్రిమ విధానాలతో రంగుమారిన ఫలాలతో ఉదర సంబంధ వ్యాధులు ప్రబలుతున్నట్లు ఇటీవల ప్రచురించిన ఓ జర్నల్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.  
సంప్రదాయ విధానానికి స్వస్తి.. సంప్రదాయ పద్ధతిలో కాయలను మాగబెట్టేందుకు ప్రత్యేక గదులను వినియోగిస్తారు. వాటిలోకి గాలి చొరబడకుండా పేడతో అలుకుతారు. అందులో తడిచిన పిడకలు, కొబ్బరి పీచుతో సిద్ధం చేసిన బెడ్లపై కాయలను పేర్చుతారు. తెల్లవారేసరికి ఆ కాయలు రంగు మారి విక్రయానికి సిద్ధంగా ఉంటాయి. ఈ విధానంలో పండ్లు అందుబాటులోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో రసాయనాలను ఆశ్రయిస్తున్నారు. 
కృత్రిమ పద్ధతిలో ఇలా.. అరటి, మామిడి, సపోటాలను టోకుగా కొనుగోలు చేసి ఇథిలీన్‌ పౌడర్‌ లేదా ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. దీంతో ఉదయానికి కాయలు మంచిరంగు తేలుతున్నాయి. మరో విధానంలో కాల్షియం కార్బైడ్‌ను పొట్లాలుగా కట్టి కాయల మధ్యలో ఉంచుతారు. సహజంగా పండిన అరటి కాయలు హస్తం మొదట్లో ఆకుపచ్చగా ఉంటుంది. అలాకాకుండా కాయంతా ఒకే రంగులో ఉంటే రసాయనాలు వాడినట్లుగా నిర్ధారించవచ్చు. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ క్రమంగా దెబ్బతింటుందని, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని పట్టణానికి చెందిన వైద్యనిపుణుడు శ్రీనివాస్‌ తెలిపారు. దీనిపై ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా తనిఖీలు చేపట్టి పండ్ల నమూనాలను పరీక్షలకు పంపుతామన్నారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తామన్నారు.


కృత్రిమ పద్ధతిలో రంగు వచ్చిన మామిడి

చూసీచూడనట్టుగా... కాసులకు కక్కుర్తి పడి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులను కట్టడి చేయాల్సిన అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక్క తాడేపల్లిగూడెంలో మాత్రమే కాదు ఉభయ జిల్లాల్లోనూ ఈ పరిస్థితి ఉన్నా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు నామమాత్రంగా దాడులు నిర్వహించి మమ అనిపిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని