logo

రవాణాశాఖ సేవలన్నీ ఒకే చోటకు

ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ దరఖాస్తు చేసుకునే ఏపీఆర్‌టీఏ వెబ్‌సైట్‌కు కాలం చెల్లింది. దేశంలో రవాణా శాఖ సేవలన్నీ ఒకేచోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒక్కో రాష్ట్రం ఒక్కో వెబ్‌సైట్‌ నుంచి రవాణా సేవలు అందిస్తున్నాయి.

Published : 20 May 2022 06:03 IST

డీటీసీ సిరి ఆనంద్‌ 

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే:  ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ దరఖాస్తు చేసుకునే ఏపీఆర్‌టీఏ వెబ్‌సైట్‌కు కాలం చెల్లింది. దేశంలో రవాణా శాఖ సేవలన్నీ ఒకేచోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒక్కో రాష్ట్రం ఒక్కో వెబ్‌సైట్‌ నుంచి రవాణా సేవలు అందిస్తున్నాయి. ఇకపై దేశవ్యాప్తంగా ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్‌ పరీక్షల వివరాల నమోదుకు కేంద్రం రూపొందించిన పరివాహన్‌ వెబ్సైట్‌లోకి వెళ్లాల్సిందే. రవాణా శాఖలోని పలు సేవలు, ఆర్సీ, డీఎల్‌ కార్డుల పరిస్థితి  తదితర వివరాలను జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్‌ వి.సిరి ఆనంద్‌ ‘న్యూస్‌టుడే’కు వెల్లడించారు. ఏపీ ప్రగతి వెబ్‌సైట్‌ సైతం కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ వెబ్‌సైట్‌లోకి మార్చినట్లు చెప్పారు. ఎల్‌ఎల్‌ఆర్, డీఎల్‌ సేవలు పరివాహన్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయని తెలిపారు. 

దరఖాస్తు ఇలా.. 
https://parivahan.gov.in/parivahan  వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.  ఏపీని ఎంపిక చేస్తే రాష్ట్ర రవాణాశాఖలోకి  వెళ్తాం. ఇక్కడ మనకు కావాల్సిన సేవలు, చిరునామా వివరాలు కనిపిస్తాయి. ఎల్‌ఎల్‌ఆర్‌/డీఎల్‌ దరఖాస్తు, డీఎల్‌ రెన్యువల్, నకలు డీఎల్, చిరునామా మార్పు, అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ దరఖాస్తు రుసుముల చెల్లింపు సేవలన్నీ కనిపిస్తాయి. ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే దానిపై క్లిక్‌ చేయాలి. ఆధార్‌ అనుసంధానంతో కూడిన సేవను ఎంపిక చేసుకుంటే చరవాణికి ఓటీపీ నంబరు వస్తుంది. దీనిని నమోదు చేసిన వెంటనే వెబ్‌పేజీ తెరుచుకుంటుంది. వివరాలు పూర్తి చేయాలి.   అన్ని సక్రమంగా ఉంటేనే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షకు అనుమతి వస్తుంది. వీటిని పూర్తి చేసిన తర్వాత సంబంధిత ఆధార్, వయసు ధ్రువీకరణ పత్రం ఫొటో సంతకంతో అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత రుసుము చెల్లిస్తే ఎల్‌ఎల్‌ఆర్‌కు సమయం కేటాయిస్తారు. అంతర్జాలంలో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధిస్తే ఎల్‌ఎల్‌ఆర్‌ పత్రం వస్తుంది.  నెల తర్వాత ఆరు నెలలలోపు డ్రైవింగ్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఉత్తీర్ణత సాధిస్తే తపాలా శాఖ నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ అందుతుంది.

బకాయిలు ఉన్న మాట వాస్తవమే..  ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు వచ్చినప్పుడు కాన్వా య్‌ కోసం సమకూర్చే వాహనాలు, ఇతర కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన వాహనాలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రూ.7.91 లక్షలు చెల్లించాలి. 

ఈ నెలాఖరున కార్డులు.. జిల్లాలో అనేక మంది లైసెన్స్‌ పరీక్షలు ఉత్తీర్ణులవుతున్నారు. వీరికి సంబంధిత గుర్తింపు కార్డులు అందించాల్సి ఉంది. ప్రస్తుతం కమిషరేట్‌ నుంచి ఈ కార్డులు రావాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా కార్డులు వచ్చే అవకాశం ఉంది. సర్వర్‌ సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం సర్వర్‌ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త వెబ్‌సైట్‌ పెట్టే ముందు ఈ సమస్య రావడం సాధారణం. అయితే వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఏదైనా సమస్య వస్తే సమీప ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని