logo
Published : 24 May 2022 05:23 IST

అదిగదిగో..మీ ఇల్లు!

ఏళ్ల తరబడి ప్రకటనలతో కాలక్షేపం

విసుగెత్తుతున్న టిడ్కో లబ్ధిదారులు

భీమవరం పట్టణానికి చెందిన ఇందిర మూడున్నరేళ్ల కిందట టిడ్కో గృహం కోసం రూ.లక్ష చెల్లించారు. ఇప్పటివరకూ ఫ్లాటు మాత్రం కేటాయించలేదు. దీంతో అద్దె ఇంటికి నెలకు రూ.5 వేలు, అప్పుచేసి తెచ్చిన రూ.లక్షకు వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు. పాలకొల్లు పట్టణానికి చెందిన మరో మహిళదీ ఇదే పరిస్థితి.

తాడేపల్లిగూడేనికి చెందిన ఓ లబ్ధిదారుడికి అందరికీ ఇళ్లు పథకంలో టిడ్కో ఫ్లాటు మంజూరైంది. రుణం మంజూరుకు ఓ బ్యాంకుతో త్రిసభ్య కమిటీ ఒప్పందం జరిగింది. అతడికి గృహం కేటాయించలేదు. బ్యాంకుకు మాత్రం రుణ వాయిదా ప్రతినెలా చెల్లించక తప్పడం లేదు. ఈ అంశంపై ఆయన ఇటీవల ‘స్పందన’ కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో గత ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో పూర్తయిన ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించి గత సాధారణ ఎన్నికలకు ముందు గృహ ప్రవేశాలు కూడా చేయించారు. ఎట్టకేలకు సొంతింటి కల సాకారమైందని లబ్ధిదారులు సంతోషించారు. ఇంతలోనే పరిస్థితులు తల్లకిందులయ్యాయి. వసతులు సమకూర్చిన తర్వాత అందరికీ ఇళ్లు కేటాయిస్తామని ప్రస్తుత పాలకులు చెప్పారు. అలా చేస్తే మరీ మంచిదనుకుని సరిపెట్టుకున్న లబ్ధిదారులకు ఏళ్లు గడుస్తున్నా గృహాలు మాత్రం దక్కలేదు. ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి.. మరోసారి ఉగాది, వినాయకచవితికి, తరువాత గాంధీ జయంతి.. క్రిస్మస్‌కు ఫ్లాట్లు అప్పగిస్తామని అధికారులు, పాలకులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి. నిర్మించిన గృహ సముదాయాలకు రంగులు మార్చడం మినహా ఏ ఒక్క లబ్ధిదారుడి సొంతింటి కల నెరవేరలేదు.

పోరాటాలతో కదలిక వచ్చినా..

ఎంపికైన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను కేటాయించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆందోళనలు చేయడంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. మార్చి మొదటి వారంలో ఇళ్లు కేటాయిస్తామని అధికారులు మరోసారి హామీ ఇచ్చారు. ఆ గడువు దాటిపోయినా మళ్లీ పాతకథే పునరావృతమైంది.

లబ్ధిదారుల జియోట్యాగింగ్‌ ప్రక్రియను గతేడాది పూర్తి చేశారు. రుణం మంజూరుకు పట్టణాల్లో రెండున్నరేళ్ల కిందటే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇలా కార్యాలయాలు, బ్యాంకులు, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగడం తప్ప ఇళ్ల అప్పగింత ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై లబ్ధిదారులు విసుగెత్తిపోతున్నారు.

భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో నిర్మాణం పూర్తయిన గృహ సముదాయాల్లో మురుగుపారుదల వ్యవస్థకు సంబంధించిన పనులు పూర్తికాలేదు.

తొలివిడతలో ఫ్లాట్లు కేటాయించేందుకు భీమవరంలో 2464, పాలకొల్లులో 1984, తాడేపల్లిగూడెంలో 2944 మంది చొప్పున అధికారులు ఎంపిక చేశారు. వీరిలో 4096 మందికి రుణాలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నా ఎక్కువ మందికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మాత్రం పూర్తికాలేదు.

త్వరలో ఖరారు..

ఈ అంశంపై టిడ్కో ఈఈ స్వామినాయుడు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ నిర్మాణం పూర్తయిన ఫ్లాట్లను ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. దీనికి త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని తెలిపారు.

పట్టణాల వారీగా లబ్ధిదారులు ఇలా..

భీమవరం 8,352

తాడేపల్లిగూడెం 5,376

పాలకొల్లు 6,144

ఏలూరు 6,480

జంగారెడ్డిగూడెం 1,056

తణుకు 912

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని